శృతి హాసన్‌ లాక్‌డౌన్‌లో ఉండి వంద రోజులవుతుంది. మార్చిలో దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించిన విషయం తెలిసిందే. విదేశాలకు వెళ్ళొచ్చిన శృతి హాసన్‌ ఇంట్లోనే ఉంటుంది. క్వారంటైన్‌ నిబంధనలు పాటిస్తూ ఒంటరిగా జీవితాన్ని గడుపుతోంది. ఈ విశేషాలను తాజాగా ఆమె పంచుకుంది. ఈ మేరకు ఓ వీడియోని ఇన్‌స్టా గ్రామ్‌లో షేర్‌ చేసుకుంది. `లాక్‌డౌన్‌లో ఒంటరిగా వంద రోజులు గడిపిన అనంతర జీవితం ఇలా కనిపిస్తుంద`ని తెలిపింది.

ఈ వీడియోలో ఉదయాన్నే లేవడం, వ్యాయామం చేయడం, ఫోటో షూట్‌లు చేయడం చేసింది. ఈ వంద రోజులు గోడల మధ్యలోనే సాగిపోయిందని, చెబుతూ, తనకి వాల్స్ ఇష్టమని పేర్కొంది. ఇందులో రకరకాలుగా ప్రవర్తిస్తుంది. పలు కొంటే పనులు చేస్తుంది. వంద రోజుల తర్వాత ఇలా మారిపోయానని సరదాగా చెప్పింది. తాజాగా శృతి పంచుకున్న వీడియో సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తుంది. 

ఇదిలా ఉంటే శృతి హాసన్‌ తన అభిమానులకు సర్‌ప్రైజ్‌ ఇవ్వబోతుంది. ఈ నెల ఎనిమిదిన శృతి నుంచి అద్భుతమైన ప్రకటన రాబోతుందంటూ ప్రముఖ సినీ విశ్లేషకుడు రమేష్‌బాలా ట్విట్టర్‌లో పంచుకున్నారు. దీంతో ఆగస్ట్ 8న రాబోతున్న గుడ్‌ న్యూస్‌ ఏంటనేది ఆసక్తి నెలకొంది. ఆమె కొత్త ప్రాజెక్ట్ కి సంబంధించి అనౌన్స్ మెంట్‌ ఉంటుందా? లేక మరేదైనా అనేది సస్పెన్స్ నెలకొంది. 

ఇక `కాటమరాయుడు` తర్వాత సినిమాలకు బ్రేక్‌ తీసుకున్న శృతి గతేడాది రీఎంట్రీ ఇచ్చింది. తెలుగులో ఆమె రవితేజ సరసన `క్రాక్‌` చిత్రంలో నటిస్తుంది. ఇది విడుదలకు సిద్ధంగా ఉంది. మరోవైపు ఆమె నటించిన బాలీవుడ్‌ చిత్రం `యారా` ఇటీవల జీ5లో విడుదలై మిశ్రమ స్పందన రాబట్టుకుంది. ప్రస్తుతం తమిళంలో `లాభం`లో నటిస్తుండగా, తెలుగులో మరోసారి పవన్‌ సరసన `వకీల్‌ సాబ్‌`లోనూ కనిపించనున్నట్టు టాక్‌.