బాలీవుడ్ యంగ్‌హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసులో మంగళవారం కీలక పరిణామం చోటు చేసుకుంది. సుశాంత్ మృతిపై ఆయన తండ్రి కేకే సింగ్ పోలీసులను ఆశ్రయించారు. దీనిలో భాగంగా సుశాంత్ స్నేహితురాలు రియా చక్రవర్తిపైన పాట్నాలోని రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

 

 

రియాతో పాటు మరికొందరు స్నేహితులు మోసం, కుట్రకు పాల్పడటం ద్వారా తన కుమారుడి బలవన్మరణానికి కారణమయ్యారని కేకే సింగ్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆయన ఫిర్యాదు మేరకు పోలీసులు రియాతో పాటు మరో ఐదుగురిపై పలు సెక్షన్‌ల కింద కేసు నమోదు చేశారు.

Also Read:ఆత్మహత్యకు నాలుగురోజుల ముందు.. అక్కకి సుశాంత్ మెసేజ్

అంతేకాకుండా నలుగురు పోలీసులతో కూడిన ఓ ప్రత్యేక బృందాన్ని కేసు విచారణ నిమిత్తం ముంబైకి పంపారు. కాగా.. సుశాంత్ మరణించి ఇన్ని రోజులు కావొస్తున్నా.. ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతున్నా సుశాంత్ కుటుంబం అంతగా స్పందించలేదు.

 

 

కానీ అనూహ్యంగా ఇప్పుడు రియాపై ఫిర్యాదు చేయడం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు సుశాంత్ కేసుపై ముంబై పోలీసులు దర్యాప్తు చేస్తున్న తీరుపైనా ఆయన కుటుంబ సభ్యులు అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం.

Also Read:సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్య కేసు: కంగనాకు సమన్లు

ఇకపోతే సుశాంత్ మృతిపై సీబీఐతో విచారణ జరిపించాలని స్వయంగా రియా చక్రవర్తి కోరిన సంగతి తెలిసిందే. ఈ మేరకు కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ఆమె సోషల్ మీడియా ద్వారా విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండా సుశాంత్‌తో తన జ్ఞాపకాలను పలుమార్లు అభిమానులతో పంచుకున్నారు కూడా.

 

 

సుశాంత్ ఆత్మహత్యకు బాలీవుడ్‌లో వున్న బంధుప్రీతి కారణమంటూ ఆయన అభిమానులతో పాటు పలువురు ప్రముఖులు సైతం బాహాటంగానే ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే కేసును సీబీఐ ద్వారా విచారణ జరిపించాలని చాలా మంది డిమాండ్ చేస్తున్నారు.