సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ ఆత్మహత్య కేసులో ముంబై పోలీసులు దూకుడు పెంచారు. ఇప్పటికే సుశాంత్ సన్నిహితులు, సినీ వర్గాల వారిని విచారించిన పోలీసులు తాజాగా వివాదాస్పద నటి కంగనా రనౌత్‌ను కూడా విచారించేందుకు సిద్దమవుతున్నారు. ఇప్పటికే ఆమెకు  విచారణకు హాజరు కావాల్సిందిగా సమన్లు కూడా జారీ చేశారు. అయితే లాక్‌ డౌన్‌ సమయంలో కంగనా హిమాచల్‌ ప్రదేశ్‌లో ఉండిపోవటంతో విచారణ ఎలా చేస్తారన్న విషయంలో సందిగ్ధత నెలకొంది.

ముంబై పోలీసులు ప్రత్యక్షంగా హిమాచల్‌ ప్రదేశ్‌ వెళ్లి కంగనాను విచారిస్తారా..? లేక వీడియో కాల్‌ ద్వారా విచారిస్తారా..? అన్న విషయం తెలియాల్సి ఉంది. ప్రస్తుతం కంగనా రనౌంత్‌ మనాలిలోని తన ఇంట్లో ఉంటుంది. అయితే పోలీసులు బాంద్రాలోని పోలీస్‌ స్టేషన్‌లో హాజరు కావాలని కంగనాకు నోటీసులు పంపారు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ జూన్‌ 14న ముంబైలోని తన నివాసంలో ఆత్మహత్య చేసుకొని మరణించాడు.

సుశాంత్ మరణం తరువాత కంగనా ఇండస్ట్రీ పెద్దల వల్లే యువ నటుడు ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపిస్తూ రెండు నిమిషాల వీడియో మెసేజ్‌ను రిలీజ్ చేసింది. ఇటీవల కంగనాకు సమన్లు అందిన విషయాన్ని ఆమె లాయర్‌ ధృవీకరించాడు. అయితే మార్చి 17 నుంచి కంగనా మనాలిలోనే ఉండటంతో ఇంటరాగేషన్‌ టీంను అక్కడికే  పంపాలని ముంబై పోలీస్‌లకు సూచించినట్టుగా కంగనా తరుపు లాయర్‌ వెల్లడించారు.