హైదరాబాద్: అల్లు అర్జున్ నటించిన అల వైకుంఠపురములో సినిమా పాటపై కొత్త చర్చ ప్రారంభమైంది. సినిమా ఆదివారంనాడు ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ఫేస్ బుక్ లో ఓ పోస్టు సందడి చేస్తోంది. సినీ దర్శకుడు, రచయిత ప్రభాకర్ జైనీ పెట్టిన ఆ పోస్టుపై ఫేస్ బుక్ లో చర్చ సాగుతోంది.

"తెలుగు వారి సభ్యతా సంస్కారాలు ఎప్పుడో గతించిపోయాయనటానికి తాజా ఉదాహరణ" అంటూ ప్రభాకర్ జైనీ ఆ పాట రాసిన సిరివెన్నెల సీతారామశాస్త్రిని తప్పు పట్టారు. ఆయన పోస్టు ఇలా ఉంది.

"సామజ వర గమన, సాధు హృత్సారసాబ్జ పాల...." కీర్తన తెలుగు వాడైన త్యాగయ్య గారి కృతుల్లో గొప్పదైన ఒకటి. సీతాస్వయంవరానికి వేంచేస్తున్న శ్రీరాముని, త్యాగయ్యగారు భక్తి సమాధిలో దర్శించి, వర్ణించి వ్రాసిన కీర్తన. ఆ కీర్తన భావం ఇది:

Also Read: 'అల.. వైకుంఠపురములో' ఓవర్సీస్ టాక్!

సత్పురుషుల హృదయకమలాలలో సూర్యునివలె వెలిగే రాముడు సీతను చేపట్టటానికి గజరాజు వలె ఠీవిగా నడచి వస్తున్నాడట. ఆయన సామవేదము నుండి ఉద్భవించిన నాదామృతమట; కరుణారస సాగరుడట. యాదవ కులరత్నమైన ఆయన, వేణువుపై సప్తస్వరాల సంగీత సరస్వతిని ఆవిష్కరిస్తాడట. ఈ కృతికర్త త్యాగరాజు ఆయనను సేవిస్తున్నాడట.

Also Read: మహేష్, బన్నీ బాక్స్ ఆఫీస్ ఫైట్.. 10 కామన్ పాయింట్స్ గమనించారా?

ఇంత అర్థవంతమైన, భక్తియుతమైన కీర్తనలో పల్లవిని, పోతన గారు, "కూళలకిచ్చి యప్పడుపు కూడు భుజింపగనేల", అని చెప్పినట్లు, సత్కవియైన సిరివెన్నెల సీతారామ (ఆయనా సీతాసమేతుడైన రాముడే) శాస్త్రి గారు అదేదో కొత్త సినిమా పాటకు పల్లవిగా ఇచ్చి, అనుపల్లవిగా ఏమి వ్రాశారో చూడండి.

"సామజవరగమనా
నిను చూసి ఆగగలనా
మనసు మీద వయసుకున్న అదుపు చెప్పతగునా"

"నీ కాళ్ళని పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్లు
ఆ చూపులనల్లా తొక్కుకు వెళ్లకు దయలేదా అసలు"

ఇలా ఇంకా ప్రణయ, విరహ ప్రేలాపనలు.

తగునా ఇది మీవంటి సంస్కారవంతులైన కవులకు సిరివెన్నెల శాస్త్రి గారూ? (మీ పాట విని సీతారాములు భీతిల్లి మీ పేరులోనుండి తప్పుకున్నట్లున్నారు.) 

ప్రబాకర్ జైనీ రాసి, ఫేస్ బుక్కులో పోస్టు చేసిన ఆ వివరణపై నెటిజన్లు స్పందిస్తున్నారు. దానికి స్పందిస్తూ సీతారామశాస్త్రిపై వ్యాఖ్యలు కూడా చేస్తున్నారు.