ఇర్ఫాన్‌ ఖాన్‌.. బాలీవుడ్‌ విలక్షణ నటుడు. హాలీవుడ్‌ మెచ్చిన స్టార్‌. ఇమేజ్‌కి అతీతంగా అంతర్జాతీయ గుర్తింపు పొందిన యాక్టర్‌. వర్సెటైల్‌ యాక్టింగ్‌తో యావత్‌ ప్రేక్షక లోకాన్ని ఇర్ఫాన్‌ ఖాన్‌ అలరించారు. ఇటీవల ఆయన క్యాన్సర్‌తో పోరాడి మరణించిన విషయం తెలిసిందే. తాజాగా ఆయనకి ఏకంగా ఆస్కార్‌ సర్‌ప్రైజ్‌ ఇచ్చింది. ఓ వీడియోని తమ ఆస్కార్‌ ట్విట్టర్‌ అకౌంట్‌లో పోస్ట్ చేసి అరుదైన గౌరవం అందించింది. 

 జీవితానికి సంబంధించిన సందేశాలు అందించిన హాలీవుడ్‌ చిత్రాల్లోని చిన్న చిన్న క్లిప్‌లను సేకరించి ఒక నిమిషం 18 సెకన్ల నిడివితో ఈ వీడియోని రూపొందించింది. దాన్ని ఇర్ఫాన్‌కి గుర్తుగా ప్రపంచ సినీ లవర్స్ కి షేర్‌ చేసింది. `ఏ సెలబ్రేషన్‌ ఆప్‌ హోప్‌, థ్రో ది లెన్స్ ఆఫ్‌ మూవీస్‌, వియ్‌ లవ్‌'(ఆశ అనేది ఒక వేడుక. ఆ విషయాన్ని మనకిష్టమైన సినిమాల ద్వారా) అంటూ పోస్ట్ చేసింది. 

ఇందులో ఆస్కార్‌కి నామినేట్‌ అయిన `హర్‌`, `సెంట్‌ ఆఫ్‌ ఏ ఉమెన్‌`, `శాషాంక్‌ రిడప్షన్‌`, `ది డార్క్ నైట్‌`, `ఇంటర్‌స్టెల్లర్‌`, `పారాసైట్‌` వంటి ఐకానిక్‌ చిత్రాలతోపాటు చివరికి ఇర్ఫాన్‌ నటించిన `లైఫ్‌ ఆఫ్‌ పై` కూడా ఉంది. ఈ చిత్రంలోని ఇర్ఫాన్‌ చెప్పే  డైలాగ్‌తో ఈ వీడియో ముగిసింది. చివరి డైలాగ్‌లో `మొత్తానికి మీ కథకి సుఖాంతం ఉంది` అని అపోజిట్‌ వ్యక్తి అడగ్గా, ఇర్ఫాన్‌ `ఇంత వరకు బాగానే ఉంది` అని చెప్పడం భావోద్వేగానికి గురి చేస్తుంది. 

 తాజాగా ఈ వీడియో సోషల్‌ మీడియాలో విశేషంగా వైరల్‌ అవుతుంది. ఇర్ఫాన్‌కి నిజమైన నివాళిగా నెటిజన్లు, సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ వీడియో చూసి బాలీవుడ్‌ సెలబ్రిటీలు షాక్‌ అవుతున్నారు. దాన్నుంచి తేరుకుని ఇర్ఫాన్‌ని గుర్తు చేసుకుంటున్నారు. మరోవైపు ఆడియెన్స్, ఇర్ఫాన్‌ ఫ్యాన్స్ ఫుల్‌ ఖుషీ అవుతున్నారు. తమ అభిమాన నటుడికి ఇంతటి గౌరవం దక్కడంతో సంబరపడుతున్నారు. 

ఇర్ఫాన్‌ తెలుగులో మహేష్‌ నటించిన `సైనికుడు` చిత్రంలో విలన్‌గా మెరిసిన విషయం తెలిసిందే. దీంతోపాటు అనేక హాలీవుడ్‌ చిత్రాల్లోనూ నటించి మెప్పించారు. `పార్టీషన్‌`, `ఏ మైటీ హార్ట్`, `ది డార్జిలింగ్‌ లిమిటెడ్‌`, `ది నమస్తే`, `స్లమ్‌ డాగ్‌ మిలియనీర్‌`, `న్యూయార్క్, ఐ లవ్యూ`, `ది అమేజింగ్‌ స్పైడర్‌ మ్యాన్‌`, `లైఫ్‌ ఆఫ్‌ పై`, `జురాసిక్‌ వరల్డ్`, `ఇన్‌ఫెర్నో` వంటి పలు బ్లాక్‌బస్టర్స్ లో నటించి విశేషంగా ఆకట్టుకున్నారు. చివరగా ఆయన `పజిల్‌` అనే ఇంగ్లీష్‌ చిత్రంలో కనిపించారు. మరోవైపు బాలీవుడ్‌లో నటించిన `పాన్‌ సింగ్‌ తోమర్‌` చిత్రానికిగానూ ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డుని అందుకున్న విషయం తెలిసిందే.