హైదరాబాద్ లో జరిగిన దిశ సంఘటన ప్రస్తుతం దేశం మొత్తాన్ని కుదిపేస్తోంది. దిశని అత్యంత క్రూరంగా నలుగురు లారీ సిబ్బంది అత్యాచారం చేసి సజీవదహనం చేసిన సంగతి తెలిసిందే. ఈ దారుణ ఘటనకు వ్యతిరేకంగా ప్రజలంతా గళం విప్పుతున్నారు. మహిళా సంఘాలు, యువత, విద్యార్థి సంఘాలు ఆ దుర్మార్గులని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం నలుగురు దోషులు పోలిసుల రిమాండ్ లో ఉన్నారు. 

సినీ రాజకీయ ప్రముఖులంతా దిశా కుటుంబాన్ని పరామర్శిస్తున్నారు. మంగళవారం రోజు హీరో మంచు మనోజ్ దిశ కుటుంబ సబ్యులని కలసి పరామర్శించాడు. అనంతరం మనోజ్ మీడియాతో మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యాడు. ఈ ఘటనపై తన ఆవేదనని, ఆగ్రహాన్ని బయటపెట్టాడు. 

ప్రియాంక హత్య: ఆమె 100కి ఎందుకు కాల్ చేయలేదంటే.. సుకుమార్ షాకింగ్ కామెంట్స్!

'ఈ సంఘటన జరిగినప్పుడు నేను ఊర్లో లేను. రాగానే దిశ కుటుంబసభ్యులని పరామర్శించాలని అనుకున్నా. వారి అనుమతి తీసుకునే ఇక్కడకు వచ్చా. ఆ తల్లిదండ్రుల బాధని చూస్తుంటే నాకు ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదు. 

అల్లారు ముద్దుగా పెంచుకున్న కుమర్తె జీవితం ఇలా అయిపోతే ఏ తల్లిదండ్రులైనా భరించగలరా. డెంటల్ లో సీటు వచ్చినా.. నేను మూగజీవాలకే సేవ చేస్తానని దిశ కష్టపడి వైద్య వృత్తిని ఎంచుకుంది. తన వృత్తి, ఫ్యామిలీ తప్ప దిశకు ఈ కాలనీలో ఉన్న వారు కూడా సరిగా తెలియదు. అంత అమాయకురాలిగా పెరిగింది'. 

నిందితులపై తీవ్రమైన వ్యాఖ్యలతో మనోజ్ విరుచుకుపడుతూ.. 'కొంతమంది వెధవలు చేతిలో దిశ బలైపోయింది. ఈ సంఘటన జరగగానే అంత ఆవేశంతో ఊగిపోయారు. దోషులని మాకు విడిచిపెట్టండి మేము చూసుకుంటాం అని పోలీసులని డిమాండ్ చేశారు. మనం చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని ఏం సాధిస్తాం. ఎంతమందిని చంపుతాం అని మనోజ్ ప్రశ్నించాడు. 

ప్రియాంక హత్య: మీరు ఆ పని చేయాల్సిందే.. మోడీ, కేటీఆర్ కు మహేష్ బాబు రిక్వస్ట్!

దానికి బదులుగా సిస్టమ్ మారాలని డిమాండ్ చేయండి. మనకి రక్షణగా ఉంటారని ఆయుధాలు ఇచ్చి మరీ పోలీస్ లకు ఆ బాధ్యత అప్పగించాం. వారు సరిగ్గా పనిచేసేలా సిస్టమ్ మారాలి. ట్రాఫిక్ చలానాలు పెంచితే అంతా వణికిపోయారు. అదే భయం ఇలాంటి దుర్మార్గులలో ఎందుకు కలిగించలేకపోతున్నాం. 

ఆడవారిమీద చేయి వేస్తే.. వాళ్ళని జైల్లో చంపుతారా.. బయట చంపుతారా అనవసరం.. 24 గంటల్లో పనైపోవాలి. భయాన్ని కలిగించే అలాంటి సిస్టమ్ రావాలి. ఈ ఘటనపై ఒక సమాజంగా మనం కూడా బాధ్యత వహించాలి. ఒక తండ్రి తాగేసి ఇంట్లో భార్యని కొడితే.. వారి పిల్లలు కూడా అలాగే పెరుగుతారు. ఇలాంటి వైఖరి మారాలి. అప్పుడే సమాజం మెరుగవుతుంది. ఇలాంటి విషయాల్లో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కి నన్ను కూడా పిలవండి. మీ అన్నగానో తమ్ముడిగానో వస్తా' అని మంచు మనోజ్ మీడియాతో భావోద్వేగంగా మాట్లాడాడు.