పిల్లల ఎదుటే భర్తను అతికిరాతకంగా చంపిందో భార్య. వివరాల్లోకి వెళితే.. షాద్‌నగర్ మండలం కందివనానికి చెందిన విష్ణుమూర్తి, శారద దంపతులు.. వీరికి ఇద్దరు కుమారులు. వీరు కూలీపనులు చేసుకుంటూ జీవనం సాగిస్తూ ఉంటారు.

గత కొంతకాలం నుంచి దంపతుల మధ్య గొడవలు జరుగుతుండటంతో పెద్దలు కలగజేసుకుని పలుమార్లు రాజీ చేశారు. అయితే శనివారం వీరిద్దరి మధ్య గొడవ జరిగింది.

దగ్గర్లోనే వీరి సమీప బంధువులు ఉన్నప్పటికీ రోజు ఉండేదేగా అని పట్టించుకోలేదు. ఈ క్రమంలో సహనం కోల్పోయిన శారద... భర్త కళ్లలో కారం కొట్టి ఆ తర్వాత బండరాయితో తలపై మోది హత్య చేసింది.

ఈ సమయంలో నాన్నను కొట్టొద్దంటూ పిల్లలు తల్లిని వేడుకున్నారు. అయినప్పటికీ ఆమె మనసు కరగపోగా.. దగ్గరికి వస్తే మీకూ కరెంట్ షాక్ పెడతానంటూ హెచ్చరించింది.

ఆదివారం ఉదయం ఇంటి బయట విష్ణుమూర్తి మృతదేహం అనుమానాస్పదంగా పడివుండటాన్ని గుర్తించిన మృతురాలి సోదరి పోలీసులకు ఫిర్యాదు చేసింది. శారదే ఆ ఘటనకు పాల్పడి వుంటుందని గ్రహించి ఆమెను చెట్టుకు కట్టేసి చితకబాదారు.

ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులకు.. విష్ణుమూర్తి కుమారుడు జరిగినదంతా చెప్పాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు శారదను రిమాండ్‌కు తరలించారు. తండ్రి చనిపోవడం, తల్లి జైలుకు వెళ్తుండటంతో ఇద్దరు చిన్నారులు అనాథలుగా మిగిలారు.