విశాఖపట్నం: గత ప్రభుత్వం హయాంలో విశాఖలో భారీస్థాయిలో జరిగిన భూఅక్రమాలపై జగన్ ప్రభుత్వం ప్రత్యేక విచారణ బృందం(సిట్) ద్వారా దర్యాప్తు చేయిస్తోంది. ఈ క్రమంలో శుక్రవారం తాజాగా సిట్ బృందం జిల్లా కలెక్టర్ తో సర్క్యూట్ హౌస్ లో భేటి అయ్యారు. 

ఈ సందర్భంగా  తమకు దాదాపు 1500 ఫిర్యాదులు అందాయని దర్యాప్తు బృందం అధ్యక్షులు డా. విజయ్ కుమార్ జిల్లా కలెక్టర్ వి. వినయ్ చంద్ కు చెప్పారు.  త్వరితగతిన దర్యాప్తు జరగడానికి అదనపు సిబ్బంది అవసరమని ఆయన కలెక్టర్ ను కోరారు. 

read more  విశాఖ భూ అక్రమాల్లో చంద్రబాాబు... జగన్ కు కన్నా ఫిర్యాదు

అలాగే రికార్డులు టాంపరింగ్, సర్వే నంబర్లు మార్పు ఉన్నందువలన వీటిని పరిశీంచే ఉప కలెక్టర్లకు ఇతర బాద్యతలు అప్పగించకుండా ఉంటే వేగంగా దర్యాప్తు జరుగుతుందని కలెక్టర్ కు ఆయన వివరించారు. 

ఈ సమావేశంలో దర్యాప్తు బృందం సభ్యులు వై.వి.అనూరాధ, రిటైర్డ్ జడ్జి టి. భాస్కరరావు, ఇన్ చార్జ్ జాయింట్ కలెక్టర్ మరియు డిఆర్ఓ ఎం. శ్రీదేవి, ఉప కలెక్టర్ శైలజ పాల్గొన్నారు.

read more  విశాఖ భూకుంభకోణంపై చంద్రబాబు సిట్...అందులో ఏముందంటే...: విజయసాయి రెడ్డి

 

విశాఖపట్నంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో సంచలనం కలిగించిన భూకుంభకోణంపై ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్)ను ఏర్పాటు చేసింది. ప్రభుత్వ భూముల ఆక్రమణ, రికార్డుల తారుమారు, అసైన్డ్ భూముల ఆక్రమణలతో పాటు ఈ కుంభకోణంలో వెలుగుచూసిన అన్ని అంశాలపై సిట్ దర్యాప్తు చేయనుంది. ఇందుకు సంబంధించి సిట్‌కు ప్రభుత్వం పూర్తి అధికారాలు కల్పించింది.

తెలుగుదేశం పార్టీ హయాంలో ప్రభుత్వాధికారులు, మంత్రులు, అధికార పార్టీ నేతలు కలిసి ఈ కుంభకోణానికి పాల్పడ్డారని ఆరోపణలు వెల్లువెత్తాయి. జిల్లా కలెక్టర్ లెక్కల ప్రకారం విశాఖ నగరంతో పాటు జిల్లా వ్యాప్తంగా 10,000 ఎకరాలకు పైగా భూమి లెక్కలు తారుమారయ్యాయి.

 వీటి విలువ దాదాపు రూ.25,000 కోట్ల పైనే ఉంటుందని సమాచారం. ఈ కుంభకోణంలో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు పేరు ప్రముఖంగా వినిపించింది. విశాఖ భూముల విషయంలో పెద్ద ఎత్తున దుమారం రేగడంతో తప్పనిసరి పరిస్ధితుల్లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విచారణ కమిటీ వేశారు.

అనంతరం ప్రజాసంఘాలు, ప్రతిపక్షాలు డిమాండ్ మేరకు సిట్‌ దర్యాప్తుకు ఆదేశించారు. ఈ కుంభకోణానికి సంబంధించి 2,875 కేసులు నమోదవ్వగా.. వాటిలో కేవలం 336నే పరిగణనలోకి తీసుకున్నారు.

విశాఖ జిల్లాలో ఉన్న 3,022 గ్రామాల్లో 2 లక్షల ఎఫ్.ఎం.బి సర్వే నెంబర్లలో 16,000 నెంబర్లు గల్లంతయ్యాయి. దీనిలో సుమారు లక్ష ఎకరాల భూమి అన్యాక్రాంతం అయినట్లు అప్పట్లో చర్చ జరిగింది.

కానీ ప్రభుత్వ పెద్దల ఒత్తిడితో దానిని 10,000 ఎకరాలు మాత్రమే చిత్రించే ప్రయత్నం చేశారు. అధికార పార్టీ నేతల అవినీతి పర్వం బట్టబయలైతే 2019 ఎన్నికలకు అడ్డంకిగా మారుతుందని భావించిన చంద్రబాబు సొంత పార్టీ నేతలకు క్లీన్ చీట్ ఇచ్చారని ఆరోపణలు వినిపించాయి.