ఉద్యోగం చేయడం ఇష్టం లేదు... అలా అని చేయను అని చెప్పి ఇంట్లో కుటుంబసభ్యులను ఇబ్బంది పెట్టడం ఇష్టం లేదు. తట్టుకోలేక ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ దారుణ సంఘటన కేపీహెచ్ బీ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే...  విశాఖపట్నం జిల్లా దువ్వాడకు చెందిన గుండ్ల వెంకట నాగ చైతన్య(23) బీటెక్ పూర్తి చేశాడు. ఏడాది క్రితం నగరానికి వచ్చిన అతను కేపీహెచ్ బీ కాలనీ రోడ్ నెంబర్ 3లో బాలాజీ హాస్టల్ లో ఉంటున్నాడు. స్థానికంగా కంప్యూటర్‌ కోర్సు  నేర్చుకున్న చైతన్య జూబ్లీహిల్స్‌లోని ఓ సాప్ట్‌వేర్‌ సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. గురువారం ఉదయం ఆఫీసుకు వెళ్లకుండా ఇంట్లోని ఉండిపోయాడు. ఉదయం నుంచి తలుపులు కూడా తీయలేదని స్నేహితులు డోర్ పగలగొట్టి చూడగా... ఉరివేసుకొని కనిపించాడు.

అతని గదిలో సూసైడ్ నోట్ ఒకటి కనిపించింది. ‘తాను చేస్తున్న ఉద్యోగం నచ్చలేదని, ఊరికి వెళ్లి తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టడం ఇష్టంలేక ఆత్మహత్య చేసుకుంటున్నట్లుగా అందులో పేర్కొ న్నాడు. అంతే కాకుండా ‘నాన్నా.. అమ్మా..అక్క జాగ్రత్త అంటూ అందులో పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు.  వారి కుటుంబసభ్యులు వచ్చిన తర్వాతే చైతన్య మృతికి కారణాలు  తెలుస్తాయని పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు.