జగన్ ఆ విషయంలో కూచీపూడి డ్యాన్సర్లనే మించిపోయాడు: నిమ్మల రామానాయుడు

అమ్మఒడి పథకం పేరుతో సీఎం జగన్ రాష్ట్రంలోని అన్ని వర్గాలను మోసం చేస్తున్నాడని టిడిపి ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఆరోపించారు. 

nimmala ramanaidu fires on jagan over amma odi scheme

అమరావతి: రాష్ట్రప్రభుత్వం ఆర్భాటంగా ప్రారంభించింది అమ్మఒడి పథకం కాదు కోతలఒడి అని టిడిపి  ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఎద్దేవా చేశారు. విద్యార్థుల్ని తగ్గించడం ద్వారా తల్లులకు కడుపుకోతను మిగిల్చిన జగన్‌ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కార్పొరేషన్లలోని నిధులను ఆ పథకానికి మళ్లించడం ద్వారా ఆయా వర్గాలకు కూడా తీరని అన్యాయం చేశారని మండిపడ్డారు. 

బుధవారం ఆయన ఆత్మకూరులోని పార్టీకేంద్ర కార్యా లయంలో విలేకరులతో మాట్లాడారు. 'అమ్మఒడి' అమలుకోసం బడుగు, బలహీన, మైనారిటీ వర్గాలకు అన్యాయం చేయడం ఎంతవరకు సబబో ముఖ్యమంత్రే సమాధానం చెప్పాలన్నారు. టీడీపీ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు తీరనిద్రోహం చేసిందని... ప్రతిపక్షంలో ఉండి గగ్గోలుపెట్టిన జగన్‌ అధికారంలోకి వచ్చాక తానన్నదే విస్మరించారని పేర్కొన్నారు. పాదయాత్రలో ఇచ్చిన హామీలను మంటగలిపి  ఆయా వర్గాలకు చెందాల్సిన నిధుల్ని 'అమ్మఒడి'కి మళ్లించడం దారుణమన్నారు. 

పథకం అమలును తాము తప్పపట్టడం లేదన్న నిమ్మల వాస్తవంగా పథకానికి అర్హులైన అనేకమంది విద్యార్థులకు జగన్‌ అన్యాయం చేశాడన్నారు. 04-01-2020న జీవోనెం-6ద్వారా బీసీ కార్పొరేషన్‌ నుంచి రూ.3,432కోట్లను అమ్మఒడికి మళ్లించారని తెలిపారు. అధికారంలోకి వచ్చినవెంటనే బీసీలకు ఏటా రూ.15వేలకోట్లు ఇస్తానన్న జగన్‌ బీసీకార్పొరేషన్‌కు గండికొట్టి అక్కడున్న నిధులను ఇతర పథకాలకెలా మళ్లిస్తున్నాడో సమాధానం చెప్పాలన్నారు. ఇది బీసీలను మోసం చేయడం కాదా అని నిమ్మల నిలదీశారు. 

వైసీపీ మేనిఫెస్టోలో కాపుల అభ్యున్నతి కోసం ప్రతిఏటా రూ.2వేలకోట్లు ఇస్తానని చెప్పిన జగన్మోహన్‌రెడ్డి ఇప్పుడు కాపు కార్పొరేషన్‌ నుంచి జీవోనెం-5ద్వారా  రూ.568కోట్లను అమ్మఒడి పథకానికి తరలించి వంచించాడన్నారు. రూ.2వేలకోట్ల లో రూ. 568కోట్లకు గండికొట్టిన ముఖ్యమంత్రి మిగిలిన రూ.1400కోట్లలో కూడా ఇప్పటివరకు కాపువర్గానికి ఒక్క రూపాయిచ్చిన పాపానపోలేదన్నారు. 

read more  చంద్రబాబుపై వెంటనే కేసులు నమోదు చేయాలి...లేదంటే: ఎంపి సురేష్

మైనారిటీలపై ఎంతో ప్రేమ ఒలకబోస్తున్నట్లు నటించే జగన్‌ సర్కారు వారిని కూడా రోడ్డున పడేసిందన్నా రు. జీవోనెం-1ద్వారా 04-01-2020న మైనారిటీ కార్పొరేషన్‌ నుంచి రూ.442కోట్లను అమ్మఒడి పథకానికి తరలించడం జరిగిందన్నారు. ఎస్టీ కార్పొరేషన్‌నుంచి జీవోనెం - 6ద్వారా రూ.395కోట్లను, ఎస్సీ కార్పొరేషన్‌ నుంచి రూ.1271కోట్లను అమ్మఒడికి  తరలించిన ఘనత జగన్‌కే దక్కిందని నిమ్మల దుయ్యబట్టారు.

కొత్తపథకాన్ని ప్రకటించే ముందు నిధుల లభ్యత సాధ్యాసాధ్యాలు పరిశీలించకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ  వర్గాలనిధులకు కోతపెట్టడం ఎంతవరకు సమంజసమని టీడీపీ ఎమ్మెల్యే నిగ్గదీశారు.  

అమ్మఒడి పేరుతో జగన్‌ అంకెల గారడీ 

అర్భాటంగా, అట్టహాసంగా ప్రారంభించిన అమ్మఒడి పథకంలో లబ్ధిదారుల సంఖ్యను  ప్రభుత్వం కుదించిందన్నారు. 42లక్షల మంది తల్లులకు 84లక్షలపైచిలుకు విద్యార్థులకు పథకం కింద లబ్ది కలుగుతుందని జగన్‌ గెజిట్‌ పత్రికైన సాక్షిలో ప్రచురించారన్నారు. ఒక తల్లికి ఒకబిడ్డ అనే నిబంధన ప్రకారమే అమ్మఒడిని ప్రభుత్వం అమలుచేస్తోందని  ఆవిధంగా చూసిన 42లక్షలమంది తల్లులకు అంటే 42లక్షలమంది విద్యార్థులకే  పథకం వర్తించాలని... కానీ 82లక్షలపైబడి అని సాక్షిలో వేయడం ఎవర్ని మోసగించడానికో స్పష్టంచేయాలన్నారు. 

సాక్షిలో తప్పులు రాస్తారని, ఇతరపత్రికలు చదవాలని అసెంబ్లీలో జగన్మోహన్‌రెడ్డి సూచించినందునే తన విషపత్రికలో ఈవిధమైన లెక్కలు వేయిసున్నాడా...లేక ప్రభుత్వం తప్పుడు లెక్కలు వేయించిందా అని నిమ్మల ప్రశ్నించారు. పాదయాత్రలో,ఎన్నికల ప్రచారంలో గడపగడపకు వైసీపీ కార్యక్రమంలో గానీ తల్లులందరూ వారిపిల్లల్ని బడికి పంపిస్తే ఒక్కో పిల్లాడికి ఏటా రూ.15వేలు ఇస్తానని మీపిల్లలకు మేనమామలా ఉంటానని చెప్పిన జగన్మోహన్‌రెడ్డి ఇప్పుడెలా మాటతప్పాడన్నారు.  

read more  జగన్ భార్య, తల్లీ, చెల్లి ఇప్పుడేమయ్యారు...: నిలదీసిన దివ్యవాణి

ఒకబిడ్డకే రూ.15వేలు ఇస్తున్న జగన్ మరోబిడ్డకు ఎవరు మేనమామగా ఉండాలో సమాధానం చెప్పాలని రామానాయుడు ఎద్దేవాచేశారు. సహజంగా చదువు విషయంలో తల్లిదండ్రులు మగపిల్లలకే ప్రాధాన్యత ఇస్తారని తద్వారా జగన్‌ నిర్ణయం కారణంగా ఆడబిడ్డలకే ఎక్కువ అన్యాయం జరుగుతుందని నిమ్మల పేర్కొన్నారు. 

ఆడబిడ్డలకు ఉపయోగపడని విధంగా, జగన్‌సర్కారు అమ్మఒడి పథకాన్ని అరకొరగా అమలుచేస్తోందన్నారు. మాటతప్పను-మడమతిప్పను అని, మేనిఫెస్టో తమకు భగవద్గీత, ఖురాన్‌, బైబిల్‌ అని చెప్పుకునే జగన్మోహన్‌రెడ్డి మడమతిప్పడంలో కూచిపూడి నాట్యకారుడినే మించిపోయాడని... మేనిఫెస్టోను అమలుచేయకుండా పవిత్రగ్రంథాలను అపవిత్రం చేసి తనమాయమాటలతో ప్రజల్ని మభ్యపెట్టాలనుకుంటున్నాడని నిమ్మల ఆగ్రహం వ్యక్తం చేశారు. 


 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios