అక్రమంగా స్టోన్‌ మెటల్‌ తరలిస్తున్న రెండు లారీలను సీజ్‌ చేసినట్టు మైనింగ్‌ శాఖ ఏడీ డాక్టర్‌ ఎస్‌వీ రమణారావు తెలిపారు. మంగళవారం రామభద్రపురం వద్ద మైనింగ్‌ శాఖ అధికారుల ఆకస్మిక దాడులు చేశారు. ఈ దాడుల్లో సాలూరు నుంచి బొబ్బిలి వైపు ఎటువంటి అనుమతి పత్రాలు లేకుండా మెటల్‌ తరలిస్తున్న రెండు లారీలను సీజ్‌ చేసి, రామభద్రపురం పోలీసులకు అప్పగించినట్టు తెలిపారు. 

అపరాధ రుసుం చెల్లించిన తరువాత లారీలను విడుదల చేస్తారన్నారు. ఈ దాడుల్లో టెక్నికల్‌ అసిస్టెంట్‌ పైడితల్లినాయుడు పాల్గొన్నారు. అనంతరం ఏడీ రమణరావు విలేకరులతో మాట్లాడుతూ, జిల్లాలో ఇసుక కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 59 ఇసుక రీచ్‌ల ద్వారా ఇప్పటివరకు 1,17,347 టన్నుల ఇసుక వినియోగించారన్నారు. ఇసుక అక్రమంగా రవాణా చేసిన వారిపై జీఓ 99 ప్రకారం రెండేళ్ల జైలుశిక్ష, రూ.2 లక్షల జరిమానా విధిస్తారని స్పష్టం చేశారు.