పోలీసు అమర వీరుల వారోత్సవాలలో భాగంగా గురువారం జిల్లా పోలీసు కార్యాలయంలోని పరేడ్ గ్రౌండ్ లో ఓపెన్ హౌస్ ఎగ్జిబిషన్ ను ఏర్పాటుచేశారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ ఫక్కీరప్ప ప్రారంభించారు.  


ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ... రాష్ట్ర డిజిపి ఉత్తర్వుల మేరకు అమర వీరుల వారోత్సవాలలో భాగంగా నిర్వహించే ఈ ఓపెన్ హౌస్ ఎగ్జిబిషన్ ను ముందుగానే ప్రారంభించామన్నారు. అక్టోబర్ 10 నుండి 20 వ తేది వరకు ఉదయం 9 నుండి మధ్యాహ్నం 1 గంటలు, మళ్లీ తిరిగి మధ్యాహ్నం 2 నుండి 5 గంటల వరకు ఈ ఓపెన్ హౌస్ ఎగ్జిబిషన్ ఉంటుందన్నారు. దీన్ని స్థానిక ప్రజలు, విద్యార్దులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. 

పోలీసులు విధి నిర్వహణలో భాగంగా వినియోగించే ఆయుధాలు , దుస్తులు, పనిముట్లు, నేరదర్యాప్తు విధానం తదితర విషయాలను విద్యార్దులకు, ప్రజలకు తెలియజేయడానికే ఈ ఓపెన్ హౌస్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ వారోత్సవాల్లో ప్రజల యొక్క శ్రేయస్సుకు మరియు దేశ రక్షణకు ప్రాణాలు అర్పించిన అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ ఈ వారోత్సవాలు నిర్వహించడం జరుగుతోందన్నారు. 


ఈ ఒపెన్ హౌస్ ఎగ్జిబిషన్ లో డ్రోన్ కెమెరా, ఫాల్కన్ వాహనం, హాక్ వాహనం, 207 వజ్ర వాహనం, రేస్ వాహనాలను వుంచారు. ఇక పోలీసులు వాడే ఆయుధాలు, వాటి విడి భాగాలైన మెటల్ డిటెక్టర్ ,  డ్రాగన్ లైట్, రాకర్, బాంబు డిస్పోజబుల్ పరికరాలు, ఫింగర్ ప్రింట్, పోలీసు కంట్రోల్ రూమ్, కమ్యూనికేషన్ మ్యాన్ ప్యాక్ సెట్స్ , నేర పరిశోధనలో ఉపయోగించే డాగ్ స్వ్కాడ్ బృందాలు, సెల్ ఫోన్ జామర్లను వుంచారు.

అలాగే ఏకె 47,9 ఎంఎం  గ్లాక్ పిస్టల్, 303 ఎల్‌ఎంజీ (లైట్ మెషిన్ గన్) , 7.62 ఎంఎం ఎస్‌ఎల్ఆర్, జీఎఫ్ రైఫిల్ , ఫెడరల్ గ్యాస్ గన్, ట్రంచెన్ పిస్టల్,  రియల్ పిస్టల్, 455 రివాల్వర్, గ్రేనెడ్ హెచ్‌ఈ 36, గ్యాస్ గ్రేనేడ్, రబ్బర్ బుల్లెట్స్, బాంబ్ బ్లాంకెట్, వెహికల్ ఇన్ స్పెక్షన్ మిర్రర్ , నైట్ విజన్ , డే విజన్ పరికరాలు, బైనాక్యులర్, జీఎఫ్ రైఫిల్స్, .303 రయిట్ గన్, 9 ఎంఎం కార్బన్ , ఇన్ శాస్ రైఫిల్, జీపిఎస్ ట్రాకింగ్, బాడీ ఒన్ కెమెరా, లాక్డ్  హౌస్ మానిటరింగ్ సిస్టమ్ లను  వుంచారు.

ఇక శక్తీ టీమ్ పోలీసులు మహిళలపై జరిగే పలు నేరాల నియంత్రణకు తీసుకునే చర్యల గురించి  విద్యార్దులకు స్వయంగా ఎస్పీనే వివరించారు. నేరం జరిగినప్పుడు నేర స్ధలాన్ని క్షుణ్ణంగా పరిశీలించి, వేలిముద్రల వంటి ఆధారాలను  సేకరించడం గురించి కూడా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీలు దీపికా పాటిల్ , రాధాక్రిష్ణ , లీగల్ అడ్వైజర్ మల్లికార్జున  డిఎస్పీ డివి రమణమూర్తి తదితరులు పాల్గొన్నారు.