అమరావతి: సినీనటుడు పవన్ కళ్యాణ్ ను తాము అసలు ఓ రాజకీయ నాయకుడిగా గుర్తించడం లేదని రవాణా శాఖ మంత్రి పేర్ని నాని అన్నారు. కేవలం చంద్రబాబు దగ్గర తీసుకున్న రెమ్యునరేషన్ కు న్యాయం చేయాలని పవన్ తీవ్ర ప్రయత్నం చేస్తున్నారన్నారు. కాబట్టి అతడిని ఇంకా ఓ సినీనటుడిగానే తాము గుర్తిస్తున్నట్లు పేర్కొన్నారు. 

జనసేన పార్టీని బీజేపీలో కలిపివేయమని జాతీయ అధ్యక్షుడు అమిత్ షా చెప్పి ఉంటారు.... అందుకు తగ్గట్లుగా పవన్ ముందస్తు సన్నాహాలు చేస్తున్నట్లు కనిపిస్తోందన్నారు. అందులో భాగంగానే తాజాగా అమిత్ షా కరెక్ట్ అని పవన్ పొగిడి వుంటారని మంత్రి పేర్కొన్నారు. 

అమిత్ షా, ప్రధాని మోడీలను పొగిడితే ఎవ్వరు జైలుకు వెళ్లరని అన్నారు. సినిమాల్లో నిర్మాతలకు కాల్షీట్లు ఇచ్చినట్లే రాజకీయాల్లో చంద్రబాబుకి కూడా  పవన్ కళ్యాణ్ కాల్షీట్లు ఇచ్చినట్లున్నారని ఎద్దేవా చేశారు. 

read more  జనసేనను బిజెపిలో విలీనం చేయాలన్నదే పవన్ ప్లాన్: కొడాలి నాని

పూటకో మాట మాట్లాడటం పవన్ కళ్యాణ్ కి అలవాటుగా మారిందన్నారు. చిన్నప్పటి నుంచి తాను క్రిస్టియన్ మతానికి దగ్గరగా పెరిగానని... అందుకే ప్రజా సేవ చేయడానికి వచ్చానని పవన్ పలు సభల్లో స్వయంగా వెల్లడించారు. ఇప్పుడు ఏకంగా హిందూ మతంపై విషం చిమ్ముతున్నారని ఆరోపించారు. 

పవన్ కళ్యాణ్ సినిమాలో మాదిరిగానే రాజకీయాల్లో కూడా నటిస్తున్నారని అన్నారు. చిరంజీవి దయవల్ల సినిమాల్లోకి వచ్చి ఆయన పేరు చెప్పడానికి కూడా ఇష్టపడని పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం ఎలాంటిదో ప్రజలు గుర్తించారని అన్నారు. 

వైసిపి మంత్రుల మాటల వల్లే దిశ లాంటి ఘటనలు జరుగుతున్నాయని పవన్ చెప్పడాన్ని బట్టి ఆయన మానసిక పరిస్థితి ఏంటో కూడా అర్ధం కావడం లేదన్నారు. తనకు కుదరకే మూడు పెళ్లిళ్లు చేసుకోవాల్సి వచ్చిందని చెపుతున్న పవన్ కు మహిళలంటే గౌరవం ఏముంటుందన్నారు.

read more  బార్ ల లైసెన్సుల రద్దు... ఏపి ప్రభుత్వానికి షాకిచ్చిన హైకోర్టు

మహిళలను గౌరవించేలా వ్యవహరించాలని సూచిస్తే అవసరమైతే మీరు కూడా పెళ్లిళ్లు చేసుకోండి అని చెప్పడం పవన్ వితండవాదాన్ని తెలియజేస్తుందన్నారు. ఇలాంటి అర్ధం పర్థం లేని మాటల ద్వారా ఆయన సమాజానికి ఏం సందేశం ఇస్తున్నారన్నారు. ఇలాంటి వ్యాఖ్యల ద్వారా పవన్ స్త్రీ జాతిని అవమానిస్తున్నారని   పేర్ని నాని అన్నారు.