అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వానికి హైకోర్టు షాకిచ్చింది. ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా వున్న అన్ని బార్ల లైసెన్సులను రద్దు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై బార్ల యజమానులు కోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన ధర్మాసనం లైసెన్సుల రద్దుపై ఆరు నెలల స్టే విధిస్తూ  తీర్పునిచ్చింది. 

ఏపిలో నూతన లిక్కర్ పాలసీని తీసుకువచ్చిన ప్రభుత్వం మద్య నియంత్రణ దిశగా చర్యలను ప్రారంభించింది. ఈ నేపథ్యంలోనే మరో ఆరునెలల గడువు ఉన్నప్పటికి ముందగానే రాష్ట్రవ్యాప్తంగా వున్న బార్ల లైసెన్సులను రద్దు చేసింది. దీంతో బార్ల యజమానులకు తమకు ప్రభుత్వ నిర్ణయం వల్ల అన్యాయం జరుగుతోందంటూ హైకోర్టును ఆశ్రయించారు. 

దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం బార్ల నిర్వహణకు ప్రభుత్వమే విధించిన లైసెన్స్ గడువు ఉన్నా ముందుగా ఎలా రద్దు చేస్తారని ప్రశ్నించింది.  కొన్ని బార్ లైసెన్సులకు 2020 వరకూ గడువు ఉందని...అయినా అన్ని బార్ లైసెన్సులను ఆకస్మికంగా ప్రభుత్వం రద్దు చేసిందని బార్ల యాజమాన్యాల తరపు న్యాయవాది న్యాయమూర్తికి విన్నవించారు. వీరి వాదనతో ఏకీభవించిన న్యాయస్థానం  లైసెన్సుల రద్దుపై ఆరు నెలల స్టే విధిస్తూ నిర్ణయం తీసుకుంది. 

read more  మందుబాబులకు జగన్ షాక్: మద్యం ధరల పెంపు

ఆంధ్ర ప్రదేశ్ లో ఇటీవలే నూతన మద్యం పాలసీని ప్రవేశపెట్టి పాత బార్ల లైసెన్సులను జగన్ ప్రభుత్వం రద్దుచేసిన విషయం తెలిసింది. తాజాగా నూతన బార్ల ఏర్పాట్లకోసం నోటిఫికేషన్ విడుదల చేసింది.  

 ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఇటీవలే రాష్ట్రవ్యాప్తంగా నూతన బార్ల లైసెన్సులకు గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. వచ్చే జనవరి ఒకటి నుంచి 2021 డిసెంబర్ 31 వరకూ రెండేళ్లపాటు బార్ల ఏర్పాటుకు కొత్తగా లైసెన్సులు జారీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలో పాత బార్ లను ఆరునెలల పాటు కొనసాగించుకోవచ్చన్న హైకోర్టు తీర్పు ప్రభుత్వానికి తలనొప్పి తీసుకువచ్చేలా కనిపిస్తోంది. 

read more  మద్య నియంత్రణలో జగన్ మరో కీలక నిర్ణయం, కొత్త ఏడాది నుంచే అమలు

కొత్త బార్ల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే విధివిదానాలు కూడా ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ కార్పోరేషన్ లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు యూనిట్ గా బార్లను కేటాయించారు. కార్పొరేషన్లలో దరఖాస్తు ఫీజు రూ. 4,50,000, మున్సిపాలిటీలు, నగర పంచాయతీలలో ఫీజు 2,00,000 లక్షలుగా నిర్దారించారు. ఇక విజయవాడ,విశాఖపట్నంలలో దరఖాస్తు ఫీజును రూ.7,00,000 లక్షలుగా నిర్దారించారు. ఏడాదికి లైసెన్సు ఫీజును రూ.5,00,000 లక్షలుగా ప్రభుత్వం నిర్దారించింది. 

నవంబర్  29వ తేదీ నుంచి వచ్చే నెల 6వ తేదీ వరకు వరకూ ఆన్ లైన్ లో దరఖాస్తులను స్వీకరించనున్నట్లు వెల్లడించారు. ఇలా వచ్చిన దరశాస్తుల్లో డిసెంబర్ 7న మధ్యాహ్నం 2 గంటలకు లాటరీ తీయనున్నట్లు ప్రకటించారు. ఆయా జిల్లాల కలెక్టర్ల సమక్షంలో ఈ లాటరీలను తీసి అదేరోజు రాత్రి 7 గంటలకల్లా బార్ల కేటాయింపు జాబితా విడుదల చేయనున్నట్లు తెలిపారు. హైకోర్టు తీర్పుతో ఈ నిర్ణయాలన్ని తారుమారు కానున్నాయి.