ఎన్నికల సమయంలో కాదు ఆ పని ఇప్పుడు చేయాలి: జగన్ కు పవన్ చురకలు
రైతుల సమస్యలను పరిష్కారానికి తాను ప్రభుత్వంతో పోరాడేందుకు సిద్దంగా వున్నట్లు జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ తెలిపారు. తాను రంగంలోకి దిగనున్నట్లు తెలియగానే జగన్ ప్రభుత్వం భయపడిపోయిందన్నారు.
వైసిపి సర్కారు రైతుల పట్ల నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తోందని జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ మండిపడ్డారు. మట్టి నుంచి కస్తూరి పరిమళాన్ని తీసే శక్తి రైతుకు మాత్రమే వుందని... అలా చేయాలంటే వారికి పాలకుల నుండి సహకారం అందాలన్నారు. కాబట్టి వైసిపి ప్రభుత్వం, నాయకులు అన్నదాతల సమస్యలపై స్పందించాలని డిమాండ్ చేశారు.
పవన్‌కల్యాణ్ ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో పర్యటనలో వున్నారు. ఈ సందర్భంగా స్థానిక రైతులతో చర్చించిన ఆయన వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... అన్నం పెట్టే రైతన్నకు న్యాయం జరిగే వరకూ అండగా ఉంటానని హామీ ఇచ్చారు.
READ MORE కుప్పంలో ఏనుగుల గుంపు బీభత్సం... అన్నదాతల ఆందోళన
''ఓట్ల కోసం పాదయాత్రలు కాదు.. రైతుల కన్నీళ్లు తుడవటానికి ఇప్పుడు పాదయాత్రలు అవసరం'' అంటూ పరోక్షంగా ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ ను ఉద్దేశిస్తూ మాట్లాడారు. వైసిపి ఎమ్మెల్యేలు రైతుల కన్నీటితో రక్తం కూడు తింటున్నారని... ఇకనైనా వారి సమస్య పరిష్కారం దిశగా ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని సూచించారు.
ఎన్నికల్లో సమయంలో మాదిరిగానే ముఖ్యమంత్రి జగన్ ఇప్పుడు ప్రజల్లో తిరగాలని సూచించారు. ప్రజల్లోకి వెళితే వారు ఏయే సమస్యలతో బాధపడుతున్నారో అర్థమవుతుందన్నారు.
READ MORE వైఎస్ వివేకా హత్యపై అనుమానాలు... జగన్ ను నిలదీస్తూ కన్నా లేఖ
ప్రస్తుత పరిస్థితులపై తనకు నిజాలు చెబితే విజిలెన్స్ దాడులు ఉంటాయని రైస్ మిల్లర్లను వైసిపి నేతలు బెదిరించారని ఆరోపించారు. జిల్లాలో తన పర్యటన ఖరారు కావటంతో ప్రభుత్వం భయపడిపోయిందన్నారు. అందువల్లే ధాన్యం కొనుగోళ్లకు సంబంధించిన రూ.80 కోట్లను అర్ధరాత్రి విడుదల చేసిందన్నారు.
దీనిపై లోతుగా విశ్లేషణ చేసి రైతు సమస్యలు తీర్చేందుకు ప్రణాళికలు చేస్తామని అన్నారు. రాష్ట్రంలోని ప్రతి రైతుకు న్యాయం జరగాలంటే పండించిన పంటకు మద్దతు ధర లభించాలని... ఆ దిశగా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని పవన్ ప్రకటించారు.