హుజూర్ నగర్: రాష్ట్ర గిరిజన, మహిళా-శిశు సంక్షేమ శాఖ మంత్రి  సత్యవతి రాథోడ్ శనివారంనాడు నానమ్మ అయ్యారు. ప్రస్తుతం ఆమె హుజుర్ నగర్ లోని ఉప ఎన్నికల ప్రచారంలో ఉన్నారు. నాయనమ్మ అయిన సందర్భంగా మఠంపల్లిలో ఆమెకు మిగతా మహిళా నేతలు శుభాకాంక్షలు తెలిపారు. 

సత్యవతీ రాథోడ్ కు మహబూబాబాద్ ఎంపీ  మాలోత్ కవిత, ఇల్లందు ఎమ్మెల్యే శ్రీమతి హరిప్రియ నాయక్, టి.ఆర్.ఎస్ గిరిజన నేతలు రామచంద్రు నాయక్, రమణా నాయక్, తదితరులు స్వీట్స్ తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. 

హుజూర్ నగర్ నియోజకవర్గంలో గిరిజన ఓటర్లు దండిగా ఉండడంతో టీఆర్ఎస్ నాయకత్వం సత్యవతీ రాథోడ్, మాలోత్ కవిత, హరిప్రియ నాయక్ లను ప్రచారానికి పంపించింది. సత్యవతీ రాథోడ్ గిరిజన తండాలు తిరుగుతూ ప్రచారం సాగిస్తున్నారు. 

హుజూర్ శాసనసభ నియోజకవర్గానికి జరుగుతున్న ఉప ఎన్నికలో టీఆర్ఎస్ తరఫున శానంపూడి సైదిరెడ్డి, కాంగ్రెసు తరఫున పద్మావతి పోటీ చేస్తున్నారు. వీరిద్దరి మధ్యనే ప్రధానంగా పోటీ నెలకొని ఉంది. బిజెపి, టీడీపీ అభ్యర్థులు కూడా రంగంలో ఉన్నారు. 

హుజూర్ నగర్ శాసనసభ నియోజకవర్గానికి ఈ నెల 21వ తేదీన పోలింగ్ జరగనుంది. శనివారం సాయంత్రం ప్రచార ఘట్టం ముగుస్తుంది. 

Video: హుజూర్ నగర్ ప్రచారం: గుడిసెల్లోకి... బైక్ పై... సత్యవతి రాథోడ్ .