విశాఖపట్నం: గాన గంధర్వ పద్మశ్రీ  ఘంటసాల వెంకటేశ్వర రావు మ్యూజియం విజయవాడ సంగీత కళాశాలలో ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు వెల్లడించారు. బుధవారం వైజాగ్ లోని వుడా చిల్డ్రన్స్ ఎరీనాలో ప్రభుత్వం నిర్వహించిన రాష్ట్ర స్థాయి ఘంటసాల 97వ జయంతి ఉత్సవాలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.  

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... మధుర గానానికి అర్థం ఘంటసాల, ఆయన గానామృతం పండిత పామర రంజితమని కొనియాడారు.స్వర్గీయ ఘంటసాల విగ్రహాలు ఆయన అభిమానులు ఇప్పటివరకు 38 ప్రతిష్టించారని మరో 4 విగ్రహాలు ప్రతిష్టించి గిన్నిస్ ప్రపంచ రికార్డు నమోదు చేసేందుకు కృషి చేస్తామన్నారు.

ఫిబ్రవరి 11న ఘంటసాల వర్ధంతి సందర్భంగా విశాఖపట్నంలో ఘంటసాల వర్ధంతి వారోత్సవాలను నిర్వహిస్తామని చెప్పారు. అదేవిధంగా ఆయన శతజయంతి ఉత్సవాలను కూడా నిర్వహిస్తామన్నారు. విశాఖను పర్యాటక, పారిశ్రామిక రాజధాని గానే కాకుండా సాంస్కృతిక రాజధానిగా రూపొందిస్తామన్నారు.

read more ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ పెళ్లిళ్లు చేసుకున్న పవన్... మీ పిల్లలది ఏ కులం: నిలదీసిన వైసిపి ఎమ్మెల్యే

వియమ్ఆర్‌డిఏ చైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాస్ మాట్లాడుతూ... ఘంటసాల పాట, భగవద్గీత వింటే ఒత్తిడి తగ్గుతుంది అన్నారు. ఘంటసాల తన గంధర్వ గానం తో చలనచిత్ర సీమను ఓలలాడించారని పేర్కొన్నారు. ఆయన గానం చేసిన భగవద్గీత వింటుంటే మన కళ్ళముందు కృష్ణార్జునులు సాక్షాత్కరిస్తారని చెప్పారు. అంతటి గానమాధుర్యం కలిగిన ఘంటసాల తెలుగు వాడు కావడం మన అదృష్టం అన్నారు.

 జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ మాట్లాడుతూ... కృష్ణా జిల్లా చౌటపల్లిలో పుట్టిన ఘంటసాల వెంకటేశ్వరరావు తన గాన మాధుర్యంతో తెలుగువారి ఘనతను చాటి చెప్పారని అన్నారు.  ఆయన భగవద్గీత అందరి మనసులను దోచుకున్నదని, మనసుకు పవిత్రతను కల్పిస్తుందని చెప్పారు. మంత్రి శ్రీనివాసరావు విశాఖను సాంస్కృతిక నగరంగా తీర్చిదిద్దుతున్నానని అన్నారని అందులో భాగంగానే రాష్ట్రస్థాయి కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారని తెలిపారు. 

అంతకు ముందు స్వర్గీయ ఘంటసాల కుమారుడు రత్నకుమార్ దంపతులను, ప్రముఖ సంగీత విద్వాంసులు, గాయకులు, రచయితలు రహమతుల్లా, మండపాక శారద, రామచంద్రన్,  లలిత, బి. ఏ. నారాయణ లను సన్మానించారు. ఈ సందర్భంగా ఘంటసాల రత్నకుమార్ మాట్లాడుతూ... పుణ్య ఫలం వల్ల తాను ఘంటసాల పుత్రునిగా జన్మించానని అన్నారు. నాన్నగారి పై ఉన్న అభిమానాన్ని నాపై చూపినందుకు తాను చలించి పోతున్నానని చెప్పారు. 

video news : పున్నమిఘాట్ లో మతమార్పిడులు జరుగుతుంటే జగన్ ఏం చేస్తున్నాడు....

సన్మాన గ్రహీతలు ఘంటసాలతో తమకు ఉన్న అనుబంధాన్ని గుర్తు తెచ్చుకొని నివాళులు అర్పించారు. గాయకుడు కౌషిక్ కళ్యాణ్ , డాన్స్ టీచర్ నాగకన్యక, మా తెనుగు తల్లికి మల్లె పూల దండ పాడిన భవ్యశ్రీ గీతిక లను మంత్రి ప్రశంసిస్తూ జ్ఞాపికలను అందజేశారు. 

ఈ కార్యక్రమంలోరాష్ట్ర సంస్కృతి సమితి సీఈవో ఏ.లక్ష్మికుమారి, సంయుక్త కలెక్టర్ ఎల్. శివ శంకర్, శాసనసభ్యులు గొల్ల బాబురావు, యు వి రమణ మూర్తి రాజు, ప్రముఖ రచయిత చందు సుబ్బారావు, వీజేఎఫ్ అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు,కే కే రాజు,  సమాచార శాఖ డీడీ వి మణిరామ్, సెట్విన్ సీఈవో శ్రీనివాస రావు, టిఐఓ పూర్ణిమా దేవి తదితరులు పాల్గొన్నారు.