మచిలీపట్నం: ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ లో ఇసుక కొరత నెలకొన్న విషయం తెలిసిందే. అయితే ఇది ప్రభుత్వం  సృష్టించిన కృత్రిమ కొరతేనని మాజీ మంత్రి, టిడిపి నాయకులు కొల్లు రవీంద్ర ఆరోపించారు. ఇసుకపై ప్రభుత్వ విధానాన్ని వ్యతిరేకంగా నిరాహర దీక్ష చేపట్టనున్నట్లు ఆయన తాజాగా ప్రకటించారు. 

ఈ నెల 11వ తేదీ ఉదయం 8 గంటల నుండి 12వ తేదీ రాత్రి 8గంటల వరకు కోనేరుసెంటర్ లో ఈ నిరాహార దీక్ష జరగనుంది. ఇలా దాదాపు 36 గంటల నిరవధిక దీక్షకు  రవీంద్ర సిద్దమయ్యారు. 

ఈ నేపథ్యంలో వైఎస్సార్‌సిపి నాయకులు కూడా రవీంద్ర దీక్షను భగ్నం చేసే ప్రయత్నాలను ప్రారంభించారు. ఈ  దీక్షకు వ్యతిరేకంగా కోనేరు సెంటర్లో ధర్నా చేపట్టనున్నట్లు...అందుకోసం పార్టీ శ్రేణులు భారీగా తరలిరావాలంటూ పిలుపునిచ్చారు. ఇలా టిడిపి, వైసిపి పార్టీలు ఆందోళనకు పిలుపునివ్వడంతో పట్టణంలో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది.