విజయవాడ: పాత రాజరాజేశ్వరీ పేటలని రైల్వే స్థలాన్ని నిరుపేదలకు శాశ్వతంగా అందించే ఏర్పాట్లు చేస్తున్నట్లు దేవదాయ ధర్మదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు తెలిపారు. అక్కడ గత నలభై సంవత్సరాలుగా నివసిస్తున్న వారికే అతిత్వరలో ఇళ్ళ పట్టాలను అందించనున్నట్లు మంత్రి హామీ ఇచ్చారు. 

49 డివిజన్ పాత రాజరాజేశ్వరిపేటలో  నివాసముంటున్న నిరుపేదల సమస్యల శాశ్వత పరిష్కారానికి వైఎస్ఆర్‌సిపి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగం గా  దేవదాయ శాఖ మంత్రి స్థానిక ఎమ్ఆర్ఓ సుగుణ మరియు సంబంధిత అధికారులతో కలిసి ఈ డివిజన్లో పర్యటించారు..స్థానికుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... ఈ ప్రాంతంలో ఉన్న ఐదు వందల యాభై ఇల్లకు పట్టాలు ఇచ్చేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందన్నారు. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు కేంద్ర రైల్వే శాఖ మంత్రి తో సంబంధిత అధికారులు మాట్లాడినట్లు  తెలిపారు.   రైల్వే అధీనంలో ఉన్న  స్థలాలలో నివసిస్తున్న స్థానికులకు పట్టాలు ఇచ్చేందుకు  ప్రభుత్వం చర్యలు చేపట్టిందని ఆయన వెల్లడించారు. 

పేదలు నివాసముంటున్న ఈ డివిజన్ అభివృద్దికి కట్టుబడి వున్నట్లు తెలిపారు. ఇక్కడ మంచి నీటి పైప్ లైన్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అల్లు జయలక్ష్మీ నగర్ వాసులు మంచినీటి అవసరాలు తీర్చే నిమిత్తం దాదాపు నాలుగు లక్షల రూపాయల వ్యయంతో ఈమంచినీటి పైప్ లైన్ నిర్మిస్తున్నట్లు తెలిపారు.  ఈ కార్యక్రమం లో మాజీ కార్పొరేటర్ అప్పాజీ, డివిజన్ ప్రెసిడెంట్ రబ్బానీ, నాయకులు బత్తుల పాండు, బాబు, శ్రీనివాస రెడ్డి, గొలగాని శ్రీను, సర్దార్, నాయక్, లక్ష్మణ్, లత, పద్మ, రెజీనా తదితరులు పాల్గొన్నారు.