Asianet News TeluguAsianet News Telugu

అల్లూరి సీతారామరాజు ను తలపిస్తున్న జగన్...వీరిద్దరూ...: పుష్ప శ్రీవాణి

అసెంబ్లీలో ఎస్టీ కమిషన్ బిల్లును ప్రవేశపెట్టిన తమ హక్కులను తామే కాపాడుకునే ఏర్పాటు చేసినందుకు సీఎం జగన్ కు ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి కృతజ్ఞతలు తెలిపారు.  

deputy cm pushpa srivani praises cm ys  jagan in ap assembly
Author
Amaravathi, First Published Dec 16, 2019, 5:33 PM IST

అమరావతి: రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటవుతున్న ఎస్టీ కమిషన్ గిరిజనులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న శాశ్వత రక్షక కవచమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి అబివర్ణించారు. గిరిజన హక్కుల కోసం పోరాడిన మన్యంవీరుడు అల్లూరి సీతారామరాజు తరహాలోనే సిఎం జగన్మోహన్ రెడ్డి కూడా గిరిజనుల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోతారని కితాబిచ్చారు. సాయంచేసిన చేతులను, ప్రాణం పోసిన దేవుడిని గిరిజనులు ఎప్పటికీ మర్చిపోరని పేర్కొన్నారు.

శాసనసభ సమావేశాల్లో సోమవారం ఎస్టీ కమిషన్ బిల్లును ఆమోదించిన సమయంలో జరిగిన చర్చలో ఉప ముఖ్యమంత్రి శ్రీవాణి సిఎం జగన్ పై ప్రశంసలజల్లులు కురిపించారు. ఉమ్మడి రాష్ట్రంలోనూ, నవ్యాంధ్రప్రదేశ్ లోనూ ఏ ముఖ్యమంత్రీ చేయని ఆలోచనను జగన్ చేశారని....ఇదే గిరిజనుల సంక్షేమం పట్ల ఉన్న చిత్త శుద్ధికి నిదర్శనమని చెప్పారు.

ఉమ్మడిగా ఉన్న ఎస్సీ, ఎస్టీ కమిషన్ ద్వారా గిరిజనుల సమస్యల పరిష్కారం పూర్తి స్థాయిలో జరగలేదన్న అభిప్రాయం గిరిజనుల్లో ఉందని తెలిపారు. చరిత్రలో గిరిజనుల హక్కుల కోసం తెల్లదొరలతో పోరాడిన  మన్యంవీరుడు అల్లూరి సీతారామరాజు తరహాలోనే ఎస్టీ కమిషన్ ఏర్పాటు ద్వారా గిరిజనుల హక్కులను పరిరక్షించిన ముఖ్యమంత్రి జగన్ కూడా గిరిజనుల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోతారని ప్రశంసించారు. 

గిరిజనుల హక్కులకు భంగం కలిగించినా, వివక్ష చూపినా, గిరిజన మహిళలపై అత్యాచారాలు జరిగినా, గిరిజన అభివృద్ధిని నిర్లక్ష్యం చేసినా ఈ ఎస్టీ కమిషన్ ప్రశ్నిస్తుందని.. గిరిజనుల పక్షాన నిలుస్తుందన్నారు. గిరిజన సబ్ ప్లాన్ నిధుల వినియోగాన్ని పరిశీలించడంతో పాటుగా గిరిజనుల రాజకీయ, సామాజిక, ఆర్థిక అభ్యున్నతికి అవసరమైన సలహాలను ఎప్పటికప్పుడు అందిస్తుందని వివరించారు. గిరిజనుల హక్కులను కాపాడే హక్కును గిరిజనులకే ఇచ్చిన ముఖ్యమంత్రిగా జగన్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారని అభిప్రాయపడ్డారు. 

read more దిశ చట్టంపై స్పందించిన డిల్లీ సర్కార్... జగన్ ప్రభుత్వానికి లేఖ

ఈ ఎస్టీ కమిషన్ రాష్ట్రంలోని గిరిజనులకు సీఎం ఇస్తున్న శాశ్వత రక్షణ కవచమని చెప్పారు. దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డిని గిరిజనులందరూ దేవుడిలా ఆరాధిస్తారని, తమ గిరిజన ప్రాంతాల్లో దీపంలేని గూడెం ఉంటుందేమోగానీ, వైయస్సార్ ను ఆరాధించని గుండె మాత్రం ఉండదని తెలిపారు. అభివృద్ధి అనే అమృతాన్ని తొలిసారిగా గిరిజనులకు రుచి చూపించింది వైయస్సారేనని స్పష్టం చేసారు. 

పసరు మందే దిక్కనుకొనే గిరిజనులకు ఆరోగ్యశ్రీని ఇచ్చారని, పట్టె మంచాల్లో మృత్యుపోరాటం చేసే గిరిజనులకు 108 అనే సంజీవని ఇచ్చారని. ఏ ఊరికీ తెలియని ఫీజు రియంబర్స్ మెంట్ తో ఉన్నత విద్యను అభ్యసించే అవకాశం ఇచ్చారని వివరించారు. అంబలితో ఆకలి తీర్చుకొనే గిరిజనులకు రెండు రుపాయలకు కిలో బియ్యాన్ని ఇచ్చారని, గూడులేని నిరుపేద గిరిజనులకు పక్కా ఇళ్లను మంజూరు చేసారని గుర్తు చేసారు. 

గిరిజనులు తరతరాలుగా సాగు చేసే భూములు నీవి కావని వెక్కిరిస్తే వారి భూములకు తొలిసారిగా భూమి హక్కు పత్రాలను ఇచ్చిన ఒకే ఒక్క ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి అని వెల్లడించారు. సాయం చేసిన చేతులను, ప్రాణం పోసిన దేవుడిని గిరిజనులు ఎన్నటికీ మరిచిపోరని, వైయస్సార్ మరణించినా జగన్మోహన్ రెడ్డి రూపంలో మళ్లీ ఆయన తిరిగివచ్చారని గిరిజనులందరూ నమ్ముతున్నారని పేర్కొన్నారు. ఈ కారణంగానే రాష్ట్రమంతా ఎలా ఉన్నా 2014 ఎన్నికల్లోనూ, 2019 ఎన్నికల్లో కూడా గిరిజనులందరూ ప్రతిపక్షాలకు అడ్రస్ లేకుండా చేసి జగన్మోహన్ రెడ్డికి అండగా నిలిచారని అభిప్రాయపడ్డారు. 

ముఖ్యమంత్రి రు నెలల పాలనతో గిరిజనులు పెట్టుకున్న నమ్మకం నిజమైయిందని పేర్కొన్నారు. ప్రజల మేలు కోసం ‘నాన్న ఒక్క అడుగువేస్తే నేను రెండు అడుగులు వేస్తానని’ తన పాదయాత్రలో చెప్పిన జగన్మోహన్ రెడ్డి గిరిజనుల అభివృద్ధి కోసం వంద అడుగులు వేస్తున్నారని ప్రశంసించారు. గత ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గిరిజన సలహామండలిని మూడున్నర సంవత్సరాల పాటు ఏర్పాటు చేయలేదని, అయితే తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సిఎం జగన్మోహన్ రెడ్డి మూడు నెలల్లోనే గిరిజన సలహా మండలిని ఏర్పాటు చేసారని ఈ సందర్భంగా పుష్ప శ్రీవాణి ఉదహరించారు. 

read more  మెడికల్ స్కామ్... లోకేశ్ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు

గత ప్రభుత్వంలో గిరిజనులకు మంత్రి పదవే ఇవ్వకపోగా, జగన్మోహన్ రెడ్డి గిరిజన బిడ్డనైన తనకు ఏకంగా ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చారని ప్రస్తావించారు. గిరిజనులకు ఆరోగ్యశ్రీ, మండలానికో 108, గిరిజన తల్లులకు అమ్మఒడి, గిరిజన రైతులకు రైతు భరోసా, గిరిజన బాలింతలకు 77 మండలాల్లో రెట్టింపు పౌష్టికాహారం, గిరిజన పల్లెల్లో ప్రతి ఒక్కరికీ ఇళ్ల పట్టాలు, ప్రతి ఒక్కరికీ ఫీజు రియంబర్స్ మెంట్, గిరిజనుల గృహాలకు ఉచిత విద్యుత్, పొలాలకు ఉచిత విద్యుత్, ఉచితంగా బోర్లు, భూమి పట్టాల పంపిణీ వంటి సంక్షేమ పథకాలు ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి అమలు చేయని విధంగా చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గిరిజన పక్షపాతి అని అభివర్ణించారు. 

గిరిజనుల కోసం పాడేరులో మెడికల్ కాలేజీ, కురుపాంలో ఇంజనీరింగ్ కాలేజీ, సాలూరులో గిరిజన యూనివర్సిటీ వంటివి గిరిజన ప్రాంతాల ప్రజలు వారి జీవితాల్లో మొట్టమొదటిసారిగా వింటున్న పదాలని అభిప్రాయపడ్డారు. గత వందేళ్ల కాలంలో ఎవరూ చేయని పనులను, మరో వందేళ్లయినా చూస్తామో, లేదో అనుకున్నపనులను జగన్మోహన్ రెడ్డి వంద రోజుల పాలనలోనే చేసి చూపించారని పుష్ప శ్రీవాణి ప్రశంసించారు. 

ఎన్ని సంక్షేమ పథకాలను తీసుకొచ్చినా గిరిజనుల ఆత్మాభిమానం హక్కులను గౌరవించే వ్యవస్థలు లేకపోతే గిరిజనులకు సాధికారత లభించదని, అందుకే సాధికారత సాధనలో భాగమైన ఎస్టీ కమిషన్ ను ముఖ్యమంత్రి తీసుకొస్తున్నారని వివరించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని గిరిజనులందరి తరుపున సిఎంకు పుష్ప శ్రీవాణి  ధన్యవాదాలు తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios