అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం మహిళా సంరక్షణ కోసం తీసుకుచ్చిన ''దిశ చట్టం'' పై యావత్ మహిళా లోకమే కాదు యావత్ భారతం ప్రశంసలు కురిపిస్తోంది. తాజాగా ఈ చట్టం, తీసుకువచ్చిన ప్రభుత్వంపై ఇతర రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా ప్రశంసలు కురిపిస్తున్నాయి. అలా దిశ చట్టాన్ని తీసుకువచ్చి మహిళా రక్షణకు కట్టుబడి వున్నట్లు అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన జగన్ ప్రభుత్వంపై డిల్లీ ప్రభుత్వం ప్రశంసలు కురిపించారు. 

డిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆదేశాల మేరకు అధికారులు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వానికి  ఓ లేఖ రాసింది. దిశ ఘటన దేశం మొత్తాన్ని కలచివేసిందని... అలాంటి దుర్ఘటనతో చలించిన ఏపి ప్రభుత్వం ఇలాంటి నేరాలకు పాల్పడే నిందితులను అతి కఠినంగా శిక్షించడానికి ఏకంగా ఓ కొత్త చట్టాన్ని తీసుకురావడం అభినందనీయమన్నారు.

జగన్ మంత్రివర్గం వెంటవెంటనే నిర్ణయాలు తీసుకుని అసెంబ్లీలో కూడా బిల్లును ప్రవేశపెట్టడం వారి చిత్తశుద్దిని తెలియజేస్తుందన్నారు.  ఈ చట్టంలో పొందుపర్చిన అంశాలను, అమలు చేస్తున్న విధానాన్ని తెలియజేయాల్సిందిగా డిల్లీ సర్కార్  కోరింది. 

read more  మెడికల్ స్కామ్... లోకేశ్ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు

డిల్లీ  సర్కార్ రాసిన ప్రశంసా లేఖను సోమవారం అసెంబ్లీలోనే స్పీకర్ తమ్మినేని సీతారాం చదివి వినిపించారు. ఈ క్రమంలో  స్పీకర్ కూడా దిశ  చట్టంపై ప్రశంసలు  కురిపిస్తూ... తన హయాంలో ఇలాంటి చారిత్రాత్మక చట్టం రూపొందించడం చాలా ఆనందంగా వుందన్నారు. 

మహిళా సంరక్షణ కోసం ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం దిశా యాక్ట్ ను తీసుకువచ్చింది.  ఈ బిల్లుకు సీఎం జగన్ సారథ్యంలోని మంత్రిమండలి ఆమోదించగా గత శుక్రవారం అసెంబ్లీ ఆమోదాన్ని కూడా  పొందింది. ఇలా మహిళలపై జరుగులతున్న అఘాయిత్యాలను అడ్డుకోడానికి నిబద్దతతో పనిచేస్తూ కఠిన చట్టాలను తీసుకువచ్చి ప్రభుత్వం, ముఖ్యమంత్రి జగన్ పై రాష్ట్ర మహిళా లోకం ప్రశంసలు కురిపిస్తోంది. 

ఈ క్రమంలో  రాజధాని ప్రాంతమైన మంగళగిరి పట్టణంలో స్థానిక మహిళలు జగన్ ఫోటోకు పాలాభిషేకం చేశారు. పట్టణంలోని  అంబేద్కర్ విగ్రహం వద్ద గుమిగూడిన మహిళలు సంబరాలు చేసుకున్నారు. 

 ఆంద్రప్రదేశ్ రాష్ట్రం లో మహిళ రక్షణకు తొలి అడుగులు పడటం హర్షణీయమమన్నారు. ఇకపై నిర్భయంగా, స్వేచ్ఛగా తిరిగే పరిస్థితులు ఏర్పడతాయని భావిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని అభినందిస్తున్నామని అన్నారు.

read more  గాంధీ సంకల్ప యాత్ర పుస్తకాన్ని ఆవిష్కరించిన కన్నా లక్ష్మీనారాయణ

దిశ యాక్ట్ ద్వారా చట్టాలను సవరించడంతో పాటు విచారణ సమయాన్ని తగ్గించి అత్యాచార ఘటనల్లో నిందితులకు 21 రోజుల్లో కఠిన శిక్షలు పడేలా అసెంబ్లీలో బిల్లు  తీసుకురావటం సంతోషకరమన్నారు.మహిళలు చిన్నారులపై, లైంగిక వేధింపులకు పాల్పడితే భయం కల్పించే విధంగా చట్టాలు  తీసుకు రావటంపై వారు  హర్షం వ్యక్తం చేశారు.