కర్నూలు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లా కరోనా వైరస్ మహమ్మారితో వణికిపోతోంది. రాష్ట్రంలో అత్యధిక కరోనా వైరస్ పాజిటివ్ కేసులు ఈ జిల్లాలోనే నమోదవుతున్నాయి. తాజాగా, కర్నూలు వైద్య కళాశాలలో కరోనా వైరస్ కలకలం సృష్టించింది.

వైద్య కళాశాలలోని వంటమనిషికి కరోనా వైరస్ వ్యాధి సోకినట్లు నిర్ధారణ అయింది. దీంతో పీడీ వైద్య విద్యార్థులు ఆందోళనకు దిగారు. అధికారులు హాస్టల్ ను ఖాళీ చేయించారు. కర్నూలు జిజీహెచ్ లో ఇప్పటికే ముగ్గురు వైద్యులకు కరోనా వైరస్ సోకింది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తాజాగా గత 24 గంటల్లో కొత్తగా 60 కరోనా వైరస్ కేసులు నమోదైన విషయం తెలిసిందే. దీంతో రాష్ట్రంలో కరోనా వైరస్ కేసుల సంక్య 1463కు చేరుకుంది. తాజాగా 24 గంటల్లో మరో ఇద్దరు మరణించారు. దీంతో రాష్ట్రంలో మరణాల సంఖ్య 33కు చేరుకుంది.

కర్నూలు జిల్లాలో గత 24 గంటల్లో కొత్తగా 25 కేసులు నమోదయ్యాయి. దీంతో కర్నూలు జిల్లా 411 కేసులతో రాష్ట్రంలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. కర్నూలు జిల్లాలో కరోనా వైరస్ కారణంగా 10 మంది మృత్యువాత పడ్డారు.