ఆదిలాబాద్ జిల్లాలోని భైంసా పట్టణంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆదివారం రాత్రి ( జనవరి 12వ తేదీ 9 గంటల ప్రాంతంలో)  ఒక వర్గానికి చెందిన యువకుడు బైక్ తో చేసిన అతి విన్యాసాలు ఈ ఉద్రిక్తతలకు కారణమయ్యాయి. చిన్నగా మొదలైన  వివాదం పట్టణమంతా పాకి తీవ్రరూపం దాల్చి పట్టణం మొత్తంతో హింసకు కారణమయ్యింది.  

ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. మోటార్ సైకిల్ ను ఓ వీధిలో రాష్ గా డ్రైవింగ్ చేసుకుంటూ వెళుతూ ఓ  యువకుడు హంగామా చేశాడు. దీంతో స్థానిక యువకులు ఆ యువకున్ని పట్టకుని మందలించి వదిలివేశారు. అయితే ఇలా మందలించినవారు వేరే  వర్గానికి చెందినవారు కావడంతో వారిపై  ప్రతీకారం తీర్చుకోడానికి సదరు యువకుడు సిద్దమయ్యాడు. 

తన వర్గానికి చెందిన దాదాపు 400-500 మందిని తీసుకువెళ్లి తనను మందలించిన యువకులపై దాడికి పాల్పడ్డాడు. ఇలా వీరు ఆ వీధిలోని 18 ఇండ్లను తగలబెట్టి హింసాత్మక వాతావరణం సృష్టించారు. 

టీఆర్ఎస్ మద్దతుతో ఎంఐఎం గుండాలు రెచ్చిపోతున్నారు : బండి సంజయ్

ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఇరు వర్గాలను సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. అయినాకూడా వినిపించుకోని అల్లరిమూకలు పోలీసులపై రాళ్ళ దాడి చేస్తూ ఫైర్ ఇంజన్ వాహనాల పైపులను కోయడం జరిగింది. ఈ దాడులనే అదునుగా  చేసుకుని పలువురి ఇళ్లను కూడా లూటీ చేసినట్లు సమాచారం.

 ఈ ఘటనలో 8మంది పోలీసులకు తీవ్ర గాయాలు అయ్యాయి. అలాగే 18 ఇండ్లు ద్వంసమవగా అనేక ఇండ్లలో లూటీ జరిగింది. మరికొందరు యువకులకు కూడా గాయాలయినట్లు తెలుస్తోంది. ఈ  అల్లర్ల నేపథ్యంలో బైంసా పట్టణంలో ఇంటర్నెట్ సేవలు నిలిపేసిన పోలీసులు కట్టుదిట్టమైప బందోబస్తును ఏర్పాటుచేశారు.