Asianet News TeluguAsianet News Telugu

రాజధాని ఉంటే అమరావతిలోనే... తరలిస్తే అక్కడికే...: అఖిలప్రియ

రాజధాని తరలింపు పేరుతో ముఖ్యమంత్రి జగన్ ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తున్నారని మాజీ మంత్రి భూమా అఖిలప్రియ ఆరోపించారు. రాజధానిని అమరావతి తరలించాల్సి వస్తూ విశాఖపట్నంకు మాత్రం తరలనివ్వభోమన్నారు. 

bhuma akhilapriya unteresting comments ap  capital issue
Author
Kurnool, First Published Jan 31, 2020, 3:55 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

కర్నూల్:  శ్రీబాగ్‌ ఒప్పందం ప్రకారం కర్నూలుకు రాజధాని ఇవ్వకుండా జగన్ ప్రభుత్వం ద్రోహం చేస్తోందని మాజీ మంత్రి, టిడిపి నాయకురాలు భూమా అఖిలప్రియ ఆరోపించారు. ఉంటే రాజధాని అమరావతిలో ఉండాలి.... తరలించదలచుకుంటే శ్రీబాగ్‌ ఒప్పందం ప్రకారం కర్నూలుకు ఇవ్వాలని అఖిలప్రియ డిమాండ్ చేశారు. 

వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం మూలంగా ఈ ఏడాది కృష్ణా నదిలో నుండి దాదాపు 750 టీఎంసీలు నీరు సముద్రంలో కలిసిపోయిందని ఆమె మండిపడ్డారు.  భారీ వర్షాలతో నిండుకుండలా మారిన శ్రీశైలం జలాశయం గేట్లను 8 సార్లు ఎత్తి నీటిని సముద్రంపాలు చేశారని... ఈ నీటిని రాయలసీమకు కేటాయించడంలో వైఫల్యం చెందిందని అన్నారు. 

సీమలో మొత్తం 11,048 చెరువుల్లో 79.33 టీఎంసీల నీటి సామర్ధ్యం ఉంటే కేవలం 17.22 టీఎంసీల నీటిని అందించడం జగన్మోహన్‌రెడ్డి పాలనా వైఫల్యానికి  నిదర్శనంగా నిలుస్తుందన్నారు. అనంతపురంలో 1,459 చెరువులు ఉంటే కేవలం 50 చెరువులు మాత్రమే నింపారని అన్నారు. జిల్లాలో మొత్తం 11 జలాశయాల పూర్తి నిల్వ సామర్ధ్యం 37.7 టీఎంసీలు అయితే కేవలం 18.88 టీఎంసీలే నిల్వ చేయడం ప్రభుత్వ వైఫల్యానికి అద్దం పడుతుందన్నారు. 

read more  420 సెక్షన్ కింద విచారణ... ఏమిటీ జగన్మాయ...: చంద్రబాబు ఆగ్రహం

గతంలో చంద్రబాబు నాయుడు పాలనలో  కేసీ కెనాల్‌ ద్వారా 3.60 లక్షల ఎకరాలకు సాగు నీరు అందించినట్లు పేర్కొన్నారు. కాని జగన్ మాత్రం కేసీఆర్‌కు భయపడి శ్రీశైలంలో 871 అడుగుల నీటిమట్టం వున్నా నీరు వదల్లేదన్నారు. దీని వల్ల సాగు భూములకు నీటి కొరత ఏర్పడి పంట దెబ్బ తినే స్థితి ఏర్పడిందని తెలిపారు. 

శ్రీశైలంలో 854 అడుగుల వరకు నీరు విడుదల చేయవచ్చన్నారు. ఇప్పటి వరకు కేసీ కెనాల్‌ ద్వారా జగన్‌ ప్రభుత్వం కేవలం 2.30 లక్షల ఎకరాలకు మాత్రమే అందించడం సీమ ప్రజలకు చేస్తున్న అన్యాయం కాదా? అని ప్రశ్నించారు. గుండ్రేవులకు చంద్రబాబు నాయుడు హయాంలో 3వేల కోట్లతో సాంక్షన్‌ ఇస్తే ఈ ప్రభుత్వం కక్షపూరితంగా క్యాన్సిల్‌ చేశారని ఆరోపించారు. గుండ్రేవుల పూర్తి అయితే కేసీ కెనాల్‌ ఆయకట్టు సస్యశ్యామలం అయ్యి ఉండేదన్నారు.

ప్రస్తుతం రాయలసీమ పరిస్థితి ఇంత ఘోరంగా ఉంటే వచ్చే వేసవి కాలంలో పరిస్థితి ఎలా ఉంటుందో అని ప్రజలు భయబ్రాంతులకు గురి అవుతున్నారని అన్నారు. ఇప్పటి వరకు రైతులు ఆత్మహత్యలు లేవని... జగన్‌ పుణ్యమా అని తాగు నీరు దొరకక సీమ ప్రజలు ఆత్మహత్యలు చేసుకుంటారేమో అన్న ప్రమాద ఘంటికలు మ్రోగుతున్నాయని అన్నారు. 

read more  నిరుద్యోగులకు శుభవార్త... ప్రభుత్వ విభాగాల్లో భారీ ఉద్యోగాల భర్తీకి సీఎం ఆదేశం

రాయలసీమ ప్రాజెక్టుల పూర్తిగా దాదాపు రూ.26 వేల కోట్లు అవసరం అవుతాయని ముఖ్యమంత్రి జలవనరుల సమీక్షలో నిర్ధారించారని... అయితే ఇంత వరకు ఒక్క రూపాయి కూడా ప్రాజెక్టులకు ఖర్చు చేయలేదన్నారు. అంతేకాకుండా  గత ప్రభుత్వ హయాంలో జరుగుతున్న పనులను కక్షపూరితంగా ఆపేయడం జగన్మోహన్‌రెడ్డి  రాయలసీమ ద్రోహిగా నిలబెడుతుందని ఆగ్రహించారు. 

ఇచ్చిన మాటకు కట్టుబడి పులివెందులకు నీరందించిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు. అంతేకాకుండా రూ.700 కోట్లు గండికోట రైతులకు అందించారని అన్నారు. చిత్రావతి రిజర్వాయర్‌ రైతులకు కేవలం రూ.50 కోట్లు కూడా ప్రభుత్వం ఇవ్వకపోవడం దారుణమన్నారు. గతంలో చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రాయలసీమకు దాదాపు 150 టీఎంసీలు అందించామని  అఖిలప్రియ వెల్లడించారు.రాయలసీమలో ఉన్న రిజర్వాయర్లు అన్ని కూడా నింపడంలో ఈ ప్రభుత్వం వైఫల్యం చెందిందని  విమర్శించారు.     

జగన్మోహన్‌రెడ్డి ధౌర్జన్యానికి కియా అనుబంధ పరిశ్రమలు పొరుగు రాష్ట్రాలకు వెళ్లాయన్నారు. కడప స్టీల్‌ ప్లాంట్‌కు టిడిపి ప్రభుత్వం రూ.2వేల కోట్లు కేటాయించి ప్రారంభోత్సవం చేసిన విషయాన్ని గుర్తుచేశారు. జగన్‌ ప్రభుత్వం ఈ స్టీల్‌ ఫ్యాక్టరీకి ఎందుకు మరో 2వేల కోట్లు కేటాయించలేదని నిలదీశారు. 

ఓర్వకల్లు విమానాశ్రయం టిడిపి ప్రభుత్వం ఏర్పాటు చేస్తే ఈ ప్రభుత్వం కనీసం విమానాలు నడపలేకపోయిందని అన్నారు.  టిడిపి ప్రభుత్వం సౌర, పవన, విద్యుత్‌ ప్లాంటులు నిర్మించి 13వేల మందికి ఉద్యోగాలు కల్పిస్తే ఈ ప్రభుత్వం ఈ పరిశ్రమల విద్యుత్‌ ప్యానళ్లు ద్వంసం చేసిందని ఆరోపించారు. పెట్టుబడులు రాకుండా అడ్డుకున్నది ఈ ప్రభుత్వమేనని మండిపడ్డారు. 

కాళహస్తి వద్ద ఎన్‌.టి.పి.సీ బెల్‌ పరిశ్రమ తరలిపోతుంటే ఆపే కృషి ఏమి చేశారు? అని ప్రశ్నించారు.  రేణిగుంట వద్ద రిలయన్స్‌ ఎలక్ట్రానిక్‌ పరిశ్రమ తరలిపోయే విధంగా చేశారని విమర్శించారు.ఈ వైఫల్యాల నుండి ప్రజల దృష్టి మరలించడానికి ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతున్నారని... తమ పరిధిలో లేని హైకోర్టు తరలింపును కర్నూలుకు ఇస్తామని ప్రజల్ని మోసం చేస్తున్నారని అఖిలప్రియ మండిపడ్డారు.

 

Follow Us:
Download App:
  • android
  • ios