Asianet News TeluguAsianet News Telugu

విదేశీ కంపనీలకు ప్రత్యేక సదుపాయాలు... కియా మోటర్స్ ప్రారంభ కార్యక్రమంలో జగన్

అనంతపురం జిల్లాలో కియా మోటార్స్ ఏర్పాటుచేసిన  ప్లాంట్ ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో సదరు సంస్ధపై ప్రశంసలు కురిపించారు.  

AP CM Jagan to inaugurate KIA motors plant
Author
Anantapur, First Published Dec 5, 2019, 2:49 PM IST

అనంతపురం జిల్లా పెనుకొండ మండలం ఎర్రమంచి వద్ద గురువారం ‘కియా’ మోటర్స్‌ కంపెనీ గ్రాండ్‌ ఓపెనింగ్‌ సెర్మనీలో ముఖ్యమంత్రి వైయస్‌జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొన్నారు. గన్నవరం నుంచి నేరుగా పుట్టపర్తి చేరుకున్న ఆయన అక్కడనుంచి ఎర్రమంచి వెళ్లారు. కియా మోటర్స్‌ ప్లాంట్‌లో వివిధ విభాగాలు సందర్శించిన తర్వాత కంపెనీ గ్రాండ్‌ ఓపెనింగ్‌ కార్యక్రమంలో సీఎం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కియా సంస్థలో ఉత్పత్తి పూర్తిస్థాయి సామర్థ్యానికి చేరుకోవడంతో ఈ కార్యక్రమం నిర్వహించారు. 

దక్షిణ కొరియాకు చెందిన కియా సంస్థ రూ.13,500 కోట్లతో ఎర్రమంచి వద్ద పరిశ్రమ ఏర్పాటు చేయడం శుభపరిణామమని ఈ సందర్భంగా జగన్ పేర్కొన్నారు. దేశీయంగా కార్ల ఉత్పత్తి ప్రారంభించిన కియా మోటర్స్‌ మరింత విస్తరించాలని, మరిన్ని చోట్ల ప్లాంట్లు ఏర్పాటు చేసి ఏటా 3 లక్షల వాహనాల ఉత్పత్తి సామర్థ్యానికి చేరుకోవాలని  ఆకాంక్షించారు. తద్వారా రాష్ట్రంలో మరెంతో మందికి ఉపాధి లభిస్తుందని ఆయన అన్నారు. 

read more  చంద్రబాబు నమ్ముకుంటే ఎవరి సంక వారు నాక్కున్నట్టే: కొడాలి నాని

కియా మోటర్స్‌కు ప్రభుత్వం అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు. అన్ని విధాలుగా తోడ్పాటు అందించడంతో పాటు కంపెనీకి సానుకూలంగా వ్యవహరిస్తుందని సీఎం హామీ ఇచ్చారు. 

మరో మైలురాయిని అందుకున్న కియాకు ప్రత్యేక శుభాకాంక్షలు: సీఎం

రాష్ట్రంలో ప్రపంచ స్థాయి ప్రమాణాలతో పరిశ్రమ ఏర్పాటు చేసినందుకు ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ కియా సంస్థను అభినందించారు. సంస్థ పూర్తి స్థాయి ఉత్పాదక సామర్ధ్యానికి చేరినందుకు శుభాకాంక్షలు తెలిపారు. ఇప్పుడు ఈ ప్లాంట్‌ను ప్రారంభిస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. కియా కంపెనీ బాటలో మరిన్ని విదేశీ కంపెనీలు భారత్‌కు తరలి రావాలని, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టాలని సీఎం ఆకాంక్షించారు. 

read more  పవన్ ది రాజకీయ అవకాశవాదం... అమిత్ షాపై పొగడ్తలు అందుకోసమే: సిపిఐ, సిపిఎం

ఎందరికో ఉపాధి

రాష్ట్రంలో కియా మోటర్స్‌ చక్కగా పని చేస్తుందన్న ముఖ్యమంత్రి సంస్థ పూర్తి స్థాయిలో ఉత్పత్తి చేపడితే ప్రత్యక్షంగా 11 వేల మందికి, పరోక్షంగా మరో 7 వేల మందికి ఉపాధి లభిస్తుందని చెప్పారు. ఇక్కడి సంస్థలో ఇప్పటికే 3 వేల మంది పని చేస్తుండగా, అనుబంధ విభాగాల ద్వారా మరో 3500 మందికి ఉపాధి లభిస్తోందని గుర్తు చేశారు.

కియా కంపెనీలో ఇప్పటికే ఏటా 70 వేల వాహనాలు ఇక్కడ ఉత్పత్తి అవుతుండగా, సంస్థ మరిన్ని ప్లాంట్లు, విభాగాలు ప్రారంభించాలని సీఎం ఆకాంక్షించారు. కియా సంస్థ ఏటా 3 లక్షల వాహనాలు ఉత్పత్తి చేసే సామర్ధ్యానికి చేరాలన్న ఆయన, తద్వారా ఇంకా ఎందరికో ఉపాధి లభిస్తుందని అన్నారు.

కియా సంస్థకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని, పూర్తి స్థాయిలో ప్రోత్సహిస్తుందని, ఆ కంపెనీకి సానుకూలంగా వ్యవహరిస్తామని ముఖ్యమంత్రి జగన్‌ చెప్పారు. తమది ప్రొయాక్టివ్‌ ప్రభుత్వం అని ఆయన వివరించారు.

కియా కార్లకు ఇక్కడ మంచి ఆదరణ ఉందన్న సంస్థ ప్రెసిడెంట్, సీఈఓ హాన్‌ ఊపాక్, ఒకేరోజు 6 వేలకు పైగా బుకింగ్స్‌ వచ్చాయని చెప్పారు. భారత్‌లో దక్షిణ కొరియా రాయబారి షిన్‌ బాంకిన్, కియా మోటర్స్‌ ఎండీ కోకిన్‌షిన్‌ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

మంత్రులు బొత్స సత్యనారాయణ, ఎం.గౌతమ్‌రెడ్డి, ఎం.శంకరనారాయణ,  జి.జయరాం, ఎంపీలు కె.గోరంట్ల మాధవ్, తలారి రంగయ్య, ఎమ్మెల్యే, ఏపీఐఐసీ చైర్‌పర్సన్‌ ఆర్‌కె రోజా, మండలి విప్‌ కాపు రామచంద్రారెడ్డితో పాటు, పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు, అనధికారులు, కియా మోటర్స్‌ ప్రతినిధులు కార్యక్రమానికి హాజరయ్యారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios