అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్ర పాలనకు, ప్రజా సంక్షేమానికి సంబంధించిన అంశాలతో పాటు మహిళా సంరక్షణపై సీఎం జగన్ నేతృత్వంలోని మంత్రివర్గం చర్చించింది. ఈ క్రమంలో అమ్మాయిలు, చిన్నారులపై పెరిగిపోతున్న లైంగిక దాడులకు తగ్గించేందుకు దిశ చట్టాన్ని  తీసుకురావాలని నిర్ణయం తీసుకున్నారు.  

ఏపి కేబినెట్‌ నిర్ణయాలివే:

1. మహిళలు, చిన్నారులకు అండగా చరిత్రాత్మక బిల్లుకు ఏపీ కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఇటీవలి దిశ సహా రాష్ట్రంలో చోటుచేసుకున్న ఘటనల తర్వాత   వైయస్‌.జగన్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం (ఆంధ్రప్రదేశ్‌ దిశ యాక్ట్‌ పేరుతో కొత్త చట్టం) తీసుకుంది. ఆంధ్రప్రదేశ్‌ క్రిమినల్‌ లా (సవరణ) చట్టం 2019 ( ఏపీ దిశ యాక్ట్‌) మరియు ఆంధ్రప్రదేశ్‌ స్పెషల్‌కోర్టు ఫర్‌ స్పెసిఫైడ్‌ అఫెన్సెస్‌ అగైనిస్ట్‌ విమెన్‌ అండ్‌ చిల్ట్రన్‌ యాక్ట్‌ 2019కి రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 

కొత్త చట్టాన్ని తీసుకు వస్తున్నామని అసెంబ్లీలో ప్రకటించిన సీఎం జగన్‌ మహిళలపై అత్యాచారం లాంటి క్రూరమైన నేరాలకు పాల్పడితే ఉరిశిక్ష విధించాలని నిర్ణరించారు. ఆధారాలున్నప్పుడు (కన్‌క్లూజివ్‌ ఎవిడెన్స్‌) 21 రోజుల్లో తీర్పు  ఇవ్వాలని...వారంరోజుల్లో దర్యాప్తు, 14 రోజుల్లో విచారణ పూర్తిచేసి మొత్తం 21 రోజుల్లో జడ్జిమెంట్‌ ఇవ్వాలని చట్టంలో పొందుపర్చారు. 

ప్రస్తుతం ఉన్న 4 నెలల విచారణ సమయాన్ని 21 రోజులకు కుదించారు. మహిళలు,చిన్నారులపై నేరాల విచారణకు ప్రతి జిల్లాలో ప్రత్యేక కోర్టుల ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. అత్యాచారం, సామూహిక అత్యాచారం, యాసిడ్‌ దాడులు, వేధింపులు, లైంగిక వేధింపులు, సోషల్‌మీడియా ద్వారా మహిళలపై వేధింపులు, చిన్నారులపై లైంగిక దాడులు తదితర నేరాలకు విచారణకు ప్రతిజిల్లాలో ప్రత్యేక కోర్టులకు కేబినెట్‌ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. 

సామాజిక మాధ్యమాల్లో మహిళలను కించపరిచేలా, వారి గౌరవానికి భంగం కలిగించేలా పోస్టింగులు పెడితే చర్యలు తీసుకోనున్నారు. ఇండియన్‌ పీనల్‌ కోడ్‌ సెక్షన్‌ 354 (ఇ) కింద చర్యలు తీసుకునేలా బిల్లులో అంశాలు న్నాయి. మొదటి సారి తప్పు చేస్తే 2 సంవత్సరాలు, రెండోసారి తప్పుచేస్తే నాలుగేళ్లు జైలుశిక్ష విధించ నున్నారు.

READ MORE రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుండే సాక్షి ఉద్యోగులకు జీతభత్యాలు: గోరంట్ల

మెయిల్స్, సోషల్‌మీడియా, డిజిటిల్‌ మీడియాల్లో మహిళల గౌరవానికి భంగం కలిగించేలా వ్యవహరిస్తే ఈ చర్యలుంటాయి.  పిల్లలపై లైంగిక నేరాలకు పాల్పడితే ఇండియన్‌ పీనల్‌ కోడ్‌ 354 (ఎఫ్‌) కింద చర్యలు 10 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల వరకూ శిక్ష విధిస్తారు. ఈ నేరాల్లో తీవ్రత ఉంటే 14 ఏళ్ల నుంచి జీవిత ఖైదు వరకూ శిక్ష వుండనుంది.  పోస్కోచట్టం కింద ఇప్పటివరకూ 3 ఏళ్ల నుంచి 5 ఏళ్ల వరకూ జైలుశిక్ష వుండగా దీన్నిపెంచుతూ రూపొందించిన బిల్లుకు కేబినెట్ ఆమోదం లభించింది. 

2. గ్రామ, వార్డు వాలంటీర్లు, సచివాలయాలతో ప్రభుత్వంలో కొత్తశాఖ ఏర్పాటుకు ఆమోదం లభించింది. గ్రామ, వార్డు వాలంటీర్లు, సచివాలయాలపై సమీక్ష, పర్యవేక్షణలకు బలోపేతమైన యంత్రాగం ఏర్పాటు చేయడమే దీని ఉద్దేశమని మంత్రివర్గం నిర్ణయించింది. లక్ష్యాలను సాధించడానికి ఇతర శాఖలతో సమన్వయం చేసుకునే దిశగా అడుగులు వేయాలని సూచించింది. ఉద్యోగులను సమర్థవంతంగా వినియోగించుకోవడంతోపాటు వారిలో లక్ష్యాలపై స్పష్టత తీసుకురావడం, భాగస్వామ్యం ద్వారా మెరుగైన ఫలితాలు రాబట్టడమే ఉద్దేశమని మంత్రివర్గం  తెలిపింది. 

3. ప్రభుత్వంలో ఏపీఎస్‌ఆర్టీసీ విలీనం కొరకు పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్ట్‌ డిపార్ట్‌మెంట్‌ ఏర్పాటుకు ఏపీ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రవాణా, రోడ్లు, రహదారులు, భవనాలశాఖలోనే ఈ విభాగం ఏర్పాటు చేయనున్నారు. ఏపీఎస్‌ ఆర్టీసీలో వివిధ కేటగిరీల్లో ఉన్న 51,488 మంది ఉద్యోగుల సంఖ్యకు తగినట్టుగా పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్ట్‌ డిపార్ట్‌మెంట్‌లో పోస్టుల ఏర్పాటుకు కేబినెట్‌ అంగీకారం  తెలిపింది. ఆర్టీసీలో ప్రస్తుతం ఉన్న అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల సేవల కొనసాగింపునకు మంత్రివర్గం అంగీకారం తెలిపింది. 

4. కాపు ఉద్యమం సందర్భంగా నమోదైన కేసుల ఉపంసహరణకు మంత్రివర్గం నిర్ణయం  తీసుకుంది. తుని ఘటన సహా కాపు ఉద్యమం సందర్భంగా నమోదైన కేసుల ఉపసంహరణకు మంత్రివర్గం ఆమోదం లభించింది. భోగాపురం భూసేకరణ సందర్భంగా నమోదైన కేసులను ఎత్తివేయాలని నిర్ణయించింది. 

READ MORE సొంత నియోజకవర్గంలోనే జగన్ పరిస్థితి ఇదీ... ఇక రాష్ట్రంలో...: టిడిపి ఎమ్మెల్యే

5. వైయస్సార్‌ పెన్షన్‌ కానుక మార్గదర్శకాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. గతంలో ఉన్న మార్గ దర్శకాలను సవరించి గ్రామీణ ప్రాంతాల్లో నెల ఆదాయం రూ.10వేల లోపు, పట్టణ ప్రాంతాల్లో రూ.12లోపు ఆదాయం ఉన్నవారికి వైయస్సార్‌ పెన్షన్‌కానుక వర్తించేలా నిర్ణయం తీసుకుంది. 
 
3 ఎకరాల పల్లం లేదా 10 ఎకరాల్లోపు మెట్ట లేదా రెండూ కలిపి 10 ఎకరాల్లోపు ఉన్నవారికి వైయస్సార్‌ పెన్షన్‌ కానుక వర్తించనుంది. సొంతంగా కారు ఉన్నవారు మాత్రం అనర్హులుగా నిర్ణయించింది. ట్యాక్సీ, ట్రాక్టర్లు,  ఆటోలు ఉన్నవారికి మినహాయింపునిచ్చింది. పట్టణ ప్రాంతాల్లో 750 చదరపు అడుగుల్లోపు ఇల్లు ఉన్నవారు అర్హులు కుటుంబంలో ఆదాయపుపన్ను చెల్లించేవారు అనర్హులు గా నిర్ణయించింది. 

6. ఆంధ్రప్రదేశ్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రూ. 101 కోట్లతో షేర్‌ క్యాపిటల్‌తో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది.  

7. ఆంధ్రప్రదేశ్‌ మిల్లెట్‌ బోర్డు చట్టం 2019 ముసాయిదాకు కేబినెట్‌ ఆమోదించింది. కరవు, వర్షభావ ప్రాంతాల్లో చిరుధాన్యాల సాగును పెంచేందుకు బోర్డు ఏర్పాటు

8. ఆంధ్రప్రదేశ్‌ పల్సస్‌ బోర్డు చట్టం 2019 ముసాయిదాకు కేబినెట్‌ ఆమోదం లభించింది. 

9. ఆంధ్రప్రదేశ్‌ సివిల్‌ సప్లైస్‌ కార్పొరేషన్‌ రుణ పరిమితి మరో రూ.3వేల కోట్లకు పెంచింది.