srikiran chowdary కాకినాడలో ఆత్మహత్య: పోలీసుల దర్యాప్తు
కాకినాడ పట్టణానికి చెందిన వైద్యుడు శ్రీకిరణ్ చౌదరి ఆత్మహత్య చేసుకున్నాడు. భూవివాదం విషయమై వైద్యుడు శ్రీకిరణ సూసైడ్ చేసుకున్నారని చెబుతున్నారు.
కాకినాడ: పట్టణంలోని ఆశోక్ నగర్ లో వైద్యుడు శ్రీకిరణ్ చౌదరి ఆత్మహత్య చేసుకున్నాడు.భూ వివాదం విషయంలో వైద్యుడు శ్రీకిరణ్ చౌదరి ఆత్మహత్య చేసుకున్నాడని సమాచారం. భూ వివాదం విషయంలో ఓ పార్టీ నేతలను శ్రీకిరణ్ చౌదరి ఆశ్రయించారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. భూమి పత్రాలు తీసుకుని డబ్బులు ఇవ్వలేదని శ్రీకిరణ్ చౌదరి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. బాధిత కుటుంబ సభ్యులు ఓ పార్టీ నేతలపై ఆరోపణలు చేస్తున్నారు. మృతదేహన్ని పోస్టు మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.జీజీహెచ్ మార్చురీ విభాగంలో శ్రీకిరణ్ చౌదరి పనిచేస్తున్నారు.
దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. చిన్న చిన్న సమస్యలకే ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. నిజామాబాద్ అర్బన్ అసెంబ్లీ స్థానం నుండి ఇండిపెండెంట్ అభ్యర్ధిగా బరిలోకి దిగిన కన్నయ్య గౌడ్ ఈ నెల 20న ఆత్మహత్య చేసుకున్నాడు. కన్నయ్య గౌడ్ ను సైబర్ నేరగాళ్లు ఇబ్బంది పెట్టినట్టుగా కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
వీడియో గేమ్స్ కు బానిసగా మారిన 16 ఏళ్ల బాలుడు ఆత్మహత్య చేసుకున్నాడు. వీడియో గేమ్స్ ను మాని చదువుపై దృష్టి పెట్టాలని తండ్రి మందలించడంతో ఆ బాలుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ఈ నెల 18న ముంబైలోని మలాడ్ ప్రాంతంలో జరిగింది.
ఈ నెల 15న హైద్రాబాద్ లంగర్ హౌజ్ లో జవాన్ రాజీందర్ ఆత్మహత్య చేసుకున్నాడు . పంజాబ్ రాష్ట్రానికి చెందిన జవాన్ లంగర్ హౌస్ లో విధులు నిర్వహిస్తున్నాడు. రాజీందర్ ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
ఆత్మహత్యలు సమస్యలకు పరిష్కారం కాదు
సమస్యలు వచ్చిన సమయంలో వాటిని ధైర్యంగా ఎదుర్కోవాలని మానసిక వైద్యులు సూచిస్తున్నారు. సమస్యలు వచ్చాయని వాటిని ఎదుర్కోలేక ఆత్మహత్యలు చేసుకోవద్దని కోరుతున్నారు. జీవితంలోని ప్రతి సమస్యకు చావు ఒక్కటే పరిష్కారం కాదు. జీవితంలో మీకెప్పుడైనా మానసిక ఒత్తిడితో బాధపడుతూ సహాయం కావాలనిపిస్తే వెంటనే ఆసరా హెల్ప్ లైన్ ( +91-9820466726 ) కి కాల్ చేయండి లేదా ప్రభుత్వ హెల్ప్ లైన్ కి కాల్ చేయండి. జీవితం చాలా విలువైనది.