ఒకే ఫ్యామిలీలో నలుగురి దారుణ హత్య : 15 నిమిషాల్లోనే పని ముగించిన అగంతకుడు, ఆటోడ్రైవర్ క్లూ .. కర్ణాటకలో సంచలనం

కర్ణాటకలో దారుణం జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురిని అత్యంత కిరాతంగా హతమార్చారు. కేవలం 15 నిమిషాల్లోనే నిందితుడు పని పూర్తి చేసుకుని వెళ్లిపోయాడు. అతని కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు.

4 of family stabbed to death by unidentified man in Udupi ksp

కర్ణాటకలో దారుణం జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురిని అత్యంత కిరాతంగా హతమార్చారు. కేవలం 15 నిమిషాల్లోనే నిందితుడు పని పూర్తి చేసుకుని వెళ్లిపోయాడు. అతని కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. ఉడిపి జిల్లా మల్పే పోలీస్ స్టేషన్ పరిధిలోని త్రిప్తి నగర్‌లోని ఓ ఇంట్లో ఆదివారం నాలుగు హత్యలు జరిగాయి. ఒకే ఘటనలో తల్లి, ముగ్గురు పిల్లలు ప్రాణాలు కోల్పోవడం యావత్ కర్ణాటక ఉలిక్కిపడింది. అయితే ఈ నాలుగు హత్యల వెనుక కారణం ఏంటన్న దానిని పోలీసులు కూపీ లాగుతున్నారు. 

ఈ ఇంటి పెద్ద నూర్ అహమ్మద్ దుబాయ్‌లో ఉద్యోగం చేస్తున్నారు. ఇతని తల్లితో పాటు భార్య హసీనా, చిన్న కుమార్తె అజ్నాన్ , చిన్న కొడుకు తృప్తి నగర్‌లో నివసిస్తున్నారు. వీరి పెద్ద కొడుకు అసాద్ ఇండిగో ఎయిర్‌లైన్స్‌లో, పెద్ద కుమార్తె అఫ్నాన్ ఎయిర్ హెస్టెస్‌గా పనిచేస్తూ బెంగళూరులో వుంటున్నారు. ఈ క్రమంలో దీపావళి పండుగకు రెండు రోజులు సెలవులు రావడంతో అఫ్నాన్ ఇంటికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం 8.30 గంటల ప్రాంతంలో ఓ వ్యక్తి ముఖానికి మాస్క్ పెట్టుకుని ఆ ఇంట్లోకి ప్రవేశించాడు. వెంట తెచ్చుకున్న కత్తితో కనిపించిన వారిని కనిపించినట్లుగా పొడిచి పొడిచి చంపాడు. 

ఈ ఘటనలో హసీనా, అఫ్నాన్, అజ్నాన్‌లు ప్రాణాలు కోల్పోయారు. సరిగ్గా అప్పుడే బయటకు వెళ్లి ఇంటికి వచ్చిన అసీంను కూడా దుండగుడు వదిలిపెట్టలేదు. వృద్ధురాలైన నూర్ అహ్మద్ తల్లిని కూడా చంపేందుకు అగంతకుడు యత్నించాడు. దీంతో ఆమె అతనికి దొరక్కుండా బాత్‌రూంలోకి వెళ్లి తలుపు గడియ పెట్టుకుంది. కాసేపటికి ఆ ఇంట్లో మారణ హోమం ముగిసింది. కిచెన్‌లో, బెడ్‌రూంలో, డ్రాయింగ్ రూం, హాల్లో ఒక్కొక్కరుగా శవాలు కనిపించగా.. ఇల్లంతా రక్తపు మరకలతో నిండిపోయింది. 

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. నిందితుడిని గుర్తించేందుకు సీసీటీవీ ఫుటేజ్‌లు పరిశీలించగా.. అతను తెలివిగా బైక్‌లపై లిఫ్ట్ అడిగి వచ్చినట్లుగా తేలింది. ఇంతలో నిందితుడిని తృప్తి నగర్ తీసుకొచ్చినట్లుగా ఓ ఆటోడ్రైవర్ క్లూ ఇచ్చాడు. నిందితుడు తనకు డబ్బులు ఇచ్చిన తర్వాత హత్యలు జరిగిన ఇంటికి వెళ్లాడని.. ఆ వ్యక్తికి దాదాపు 45 ఏళ్లు వుండొచ్చని , బ్రౌన్ కలర్ షర్ట్, ముఖానికి తెల్లటి మాస్క్ వేసుకున్నట్లు ఆటోడ్రైవర్ పోలీసులకు తెలిపాడు. 

తాను దించిన 15 నిమిషాల్లోనే అతను ఆటోస్టాండ్‌కు తిరిగి వచ్చాడని చెప్పాడు. బెంగళూరు ప్రాంతంలో మాట్లాడే కన్నడ భాషను నిందితుడు మాట్లాడాడని ఆటోడ్రైవర్ కీలక విషయాలు చెప్పాడు. ఉడిపి ఎమ్మెల్యే యశ్‌పాల్, జిల్లా ఎస్పీ డాక్టర్ అరుణ్ ఘటనాస్థలిని పరిశీలించారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ ఘటన సంచలనం సృష్టించడంతో నిందితుడి కోసం పోలీసులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. అయితే బెంగళూరులో పనిచేస్తున్న నూర్ మొహ్మద్ పెద్ద కుమార్తెపై వున్న ద్వేషంతో నిందితుడు ఈ హత్యలు చేశాడా లేక.. పెద్ద కుమారుడు అసద్ ప్రమేయం ఏమైనా వుందా అన్న కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios