ఇంగ్లాండ్ జట్టుతో బుధవారం జరిగిన నాలుగో వన్డేలో వెస్టిండిస్ హిట్టర్ క్రిస్ గేల్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 419 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్ ను తన ధనాధన్ బ్యాటింగ్ తో గేల్ గెలిపించినంత పని చేశాడు. ఇలా సిక్సర్ల మోత మోగించి ప్రపంచ క్రికెట్ చరిత్రలో అరుదైన రికార్డు సాధించిన ఏకైక క్రికెటర్ గా గేల్ నిలిచాడు. అయితే చివరి నిమిషంతో ఇంగ్లాండ్ బౌలర్లు విండీస్ ను కట్టడి చేయడంతో కేవలం 29 పరుగుల తేడాతో విండీస్ ఓటమిపాలయ్యింది. 

ఐదు వన్డేల సీరిస్ లో భాగంగా సెయింట్ జార్జియాలో జరిగిన నాలుగో వన్డేలో ఆతిథ్య ఇంగ్లాండ్ మొదట బ్యాటింగ్ చేపట్టింది. కెప్టెన్ మోర్గాన్, బట్లర్ సెంచరీలతో, మెయిర్ స్టో, హేల్స్ హాఫ్ సెంచరీలతో చెలరేగడంతో ఇంగ్లాండ్ 418 పరుగులు సాధించింది. ఇలా పర్యటక జట్టు ముందు 419 పరుగుల భారీ లక్ష్యాన్ని వుంచింది. 

అయితే భారీ లక్ష్యచేధనలో బరిలోకి దిగిన విండీస్ జట్టుకు గేల్ మంచి శుభారంభాన్ని అందించాడు. మెరుపు ఇన్నింగ్స్ తో చెలరేగి కేవలం 97 బంతుల్లోనే 14 సిక్సర్లు, 11 ఫోర్ల సాయంతో 162 పరుగుల చేశాడు. ఈ  క్రమంలోనే గేల్ ఓ అరుదైన రికార్డును సాధించాడు. అంతర్జాతీయ క్రికెట్లో ఇప్పటివరకు దిగ్గజ క్రికెటర్లేవరికీ సాధ్యం కాని రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ మ్యాచ్ లో సాధించిన 14 సిక్సర్లతో గేల్ ఖాతాలోకి 500 సిక్స్ లు చేరాయి. ఇలా అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో 500 సిక్సర్లు బాదిన ఏకైక క్రికెటర్ గా గేల్ ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. 

గేల్ సెంచరీతో, డారెన్ బ్రావ్, నర్స్, బ్రాత్ వైట్  మెరుపు హాఫ్ సెంచరీలతో రాణించినా విండీస్ ను గెలిపించలేకపోయారు. 48 ఓవర్లలో 389 పరుగులు చేసి విండీస్ జట్టు ఆలౌటయ్యింది. దీంతో 29 పరగుల తేడాతో ఆతిథ్య జట్టు విజయం సాధించింది. ఇప్పటివరకు జరిగిన నాలుగు వన్డేల్లో ఇంగ్లాండ్ 2, విండీస్ 1 గెలవగా మరో మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. దీంతో సీరిస్ విజయాన్ని నిర్ణయించే ఐదో వన్డే శనివారం జరగనుంది.