భారత్-ఆస్ట్రేలియా మధ్య జరిగిన టీ20 సీరిస్ లో భారత్ ఓటమిపాలైన విషయం తెలిసిందే. విశాఖ, బెంగళూరు లో జరిగిన రెండు టీ2 మ్యాచుల్లోను భారత్ బాగానే ఆడినా ఆసిస్ జట్టు అంతకంటే అత్యుత్తమంగా ఆడి సీరిస్ ను కైవసం చేసుకుంది. అయితే భారత్ ఓడినప్పటికి ఆటగాళ్లు మంచి ఆటతీరుతో ఫామ్ లోకి వచ్చారు. ముఖ్యంగా  ''కాఫీ విత్ కరణ్ షో'' వివాదం తర్వాత మొదటిసారి భారత జట్టులో స్థానం సంపాదించిన కేఎల్ రాహుల్ అందివచ్చిన అవకాశాన్ని ఒడిసిపట్టుకున్నాడు. రెండు టీ20ల్లోనూ 50, 47 పరుగులు సాధించి ఓపెనర్ గా జట్టుకు మంచి  ఆరంభం అందించాడు.  

ఇలా టీ20 సీరిస్ లో రాణించి అత్యుత్తమ ఆటతీరుతో ఆకట్టుకున్నప్పటికి రాహుల్ లో ఆ ఆనందం కనిపించలేదు. బెంగళూరు మ్యాచ్ ముగిసిన తర్వాత కూడా కేఎల్ రాహుల్ మాట్లాడుతూ... పాత చేదు జ్ఞాపకాలనే గుర్తుచేసుకున్నాడు. 

''నా కెరీర్లోనే అదొక(కాఫీ విత్ కరణ్ షో వివాదం) చేదు అనుభవం. ప్రతి ఒక్కరి కెరిర్లో అలాంటి అనుభవాలుంటాయి. అలాగే నాకు అది క్లిష్ట సమయం. అత్యంత కఠినమైన పరిస్థితుల నుండి బయటపడ్డాను. ఆ వివాదం కారణంగానే నాకు అత్యంత ఇష్టమైన క్రికెట్, భారత్ జట్టుకు దూరమవ్వాల్సి వచ్చింది. 

అయితే ఆ సమయంలో పూర్తిగా కృంగిపోకుండా ఆటపై దృష్టిపెట్టా. మళ్లీ జట్టులో స్థానం కోసం కసిగా ప్రాక్టీస్ చేశా. అప్పటి గడ్డు పరిస్థితుల గురించి ఆలోచించకుండా జట్టులో తనకు దక్కిన గౌరవం గురించి ఆలోచించేవాడిని. మరో అవకాశం వస్తే తప్పకుండా నిరూపించుకోవాలని అనుకున్నా. అలా గడ్డుకాలం నుండి బయటపడి టీ20 సీరిస్ లో బాగా ఆడినప్పటికి దురదృష్టవశాత్తు భారత్ ఓడిపోయింది. అందుకు చాలా బాధగా వుంది'' అని రాహుల్ తెలిపాడు.