ఇంగ్లాండ్ లో జరుగుతున్న ప్రపంచ కప్ టోర్నీలో విండీస్ ఓపెనర్ క్రిస్ గేల్ రికార్డుల మోత మోగిస్తున్నాడు. ఇప్పటికే పాక్ పై హాఫ్ సెంచరీ సాధించడంతో పాటు పలు రికార్డులను బద్దలుగొట్టాడు. ఈ హాఫ్ సెంచరీ  ద్వారా గేల్ ఇప్పటివరకు ప్రపంచ కప్ టోర్నీ 994 పరుగులను పూర్తి చేసుకున్నాడు. ఇంకో ఆరు పరుగులు సాధిస్తే అతడు విండీస్ దిగ్గజాలు బ్రియాన్ లారా, వివ్ రిచర్డ్స్ సరసపన చేరిపోతాడు. 

కరీబియన్ జట్టు తరపున ప్రపంచ కప్ లో ఇప్పటివరకు వేయి పరుగులు  మైలురాయిని కేవలం వీరిద్దరే అందుకున్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఈ మెగా టోర్నీలో మరో ఆరు పరుగులు చేస్తే గేల్ ఈ ఘనత సాధించిన మూడో విండీస్ ఆటగాడిగా నిలవనున్నాడు.  
 
ఈ మ్యాచ్ లో గేల్ మరో రికార్డును కూడా అందుకున్నాడు.  హాఫ్ సెంచరీ సాధించే క్రమంలో బాదిన మూడు సిక్సర్లను కలిపి ప్రపంచ కప్ లో గేల్ 39 సిక్సర్లు  కొట్టాడు. ఇలా ఇప్పటివరకు ఈ మెగా టోర్నీలో అత్యధిక  సిక్సర్లు  బాదిన క్రికెటర్ గా చరిత్ర సృష్టించాడు. అంతకుముందు ఈ రికార్డు దక్షిణాఫ్రికా హిట్టర్ డివిలియర్స్ పేరిట వుండేది. 37 సిక్సర్లతో టాప్ లో వున్న అతన్ని వెనక్కి నెట్టి గేల్ ఆ స్థానాన్ని ఆక్రమించాడు.   

 పాకిస్థాన్ నిర్దేశించిన 106 పరుగుల లక్ష్యాన్ని ఛేధించే క్రమంలో తనదైన హిట్టింగ్స్ తో అదరగొట్టిన గేల్ 33 బంతుల్లో 6ఫోర్లు, 3సిక్సర్ల సాయంతో అర్ధశతకాన్ని సాధించాడు. ఇది అతడి అంతర్జాతీయ వన్డే కెరీర్‌లో  52వ హాఫ్‌సెంచరీ కావడం విశేషం.