ప్రపంచ క్రికెట్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే మ్యాచ్‌గా 2019 ప్రపంచకప్ ఫైనల్ గుర్తుండిపోతోంది. నరాలు తెగే ఉత్కంఠ, అనూహ్య పరిణామాల మధ్య న్యూజిలాండ్‌పై ఇంగ్లాండ్ గెలుపొంది జగజ్జేతగా ఆవిర్భవించింది.

ఇంగ్లాండ్ పండగ చేసుకుంటుంటే... కివీస్ ఆటగాళ్లు మాత్రం కన్నీటిపర్యంతమయ్యారు. ఈ సందర్భంగా న్యూజిలాండ్ కెప్టెన్ విలియమ్సన్ మాట్లాడుతూ... ఓటమి తీవ్ర నిరాశ కలిగించిందని.. తమ ఆటగాళ్ల బాధ వర్ణనాతీతమన్నాడు.

మ్యాచ్ చాలా ఉత్కంఠభరితంగా సాగిందని.. పిచ్‌లు అంచనా వేసిన దానికంటే భిన్నంగా మారాయని విలియమ్సన్ అభిప్రాయపడ్డాడు. ఫైనల్ మ్యాచ్ టైగా మారడం వెనుక చాలా కారణాలున్నాయని... ఇది నిజంగా దురదృష్టకరమని, విశ్వవిజేతగా నిలిచిన ఇంగ్లాండ్‌ జట్టుకు కివీస్ కెప్టెన్ అభినందనలు తెలిపాడు.

ఇది కేవలం ఒక్క ఎక్స్‌ట్రా పరుగుకు సంబంధించిన విషయం కాదని.. ఎన్నో అంశాలు తమకు విజయాన్ని దూరం చేశాయన్నాడు.  మ్యాచ్ మధ్యలో చోటు చేసుకున్న కొన్ని అనూహ్య పరిణామాలు న్యూజిలాండ్‌కు శరాఘాతంగా మారాయని వలియమ్సన్ ఆవేదన వ్యక్తం చేశాడు.  

గప్టిల్ వేసిన బంతి స్టోక్స్ బ్యాట్‌ను తాకి ఓవర్‌త్రో రూపంలో బౌండరీకి వెళ్లి.. ఆరు పరుగులు రావడం ఇంగ్లాండ్‌‌కు బాగా కలిసివచ్చిందని అభిప్రాయపడ్డాడు. ఇటువంటి సంఘటనలు జరిగి ఉండాల్సింది కాదని.. ఇలాంటి ఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకూడదని కోరుకుంటున్నానని విలియమ్సన్ పేర్కొన్నాడు.

లక్ష్యఛేదనలో ఇంగ్లాండ్ చేసిన పరుగులు న్యూజిలాండ్‌ పరుగులతో సమానం కావడంతో అంపైర్లు సూపర్ ఓవర్ ఆడించారు. ఈ  సందర్భంగా  ఇంగ్లాండ్ క్రికెటర్లు బెన్‌స్టోక్స్, బట్లర్‌లు బ్యాటింగ్‌కు దిగారు.

బౌల్ట్ బౌలింగ్‌లో స్టోక్స్ ఆడిన బంతి డీప్ మిడ్‌వికెట్ మీదుగా వెళ్లింది. అతను రెండో పరుగుకు ప్రయత్నిస్తుండగా ఫీల్డింగ్ చేస్తున్న గప్టిల్ బంతిని వికెట్ల మీదకు వేశాడు. ఈ సమయంలో బంతి స్టోక్స్ బ్యాట్‌కు తగిలి  బౌండరీ చేరింది. దీంతో ఇంగ్లాండ్‌కు మొత్తం ఆరు పరుగులు రావడం న్యూజిలాండ్ ఆశలపై నీళ్లు చల్లింది.