లీడ్స్: తనకు విశ్వాసాన్ని అందించిన యువరాజ్ గురించి టీమిండియా వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ గొప్పగా చెప్పాడు. యువరాజ్ ను తాను అన్నయ్యగా భావిస్తానని చెప్పాడు.ట ఐపీఎల్‌ 12వ సీజన్‌లో తక్కువ పరుగులే చేశానని, ఆ సమయంలో తన సహచరుడుయవరాజ్‌సింగ్‌తో క్రికెట్‌ గురించి, జీవితం గురించి మాట్లాడేవాడినని అన్నాడు.

ఐపిఎల్ సీజన్‌లో పరుగులు చేయలేకపోతున్నానని యువీతో చెప్పినప్పుడు.. మరేం ఫరవాలేదు, సరైన సమయంలో నువ్వు గాడిలో పడతావు, ఇదేం పట్టించుకోవద్దని సలహా ఇచ్చాడని రోహిత్ శర్మ చెప్పాడు. బహుశా ప్రపంచ కప్ పోటీలను దృష్టిలో పెట్టుకునే యువీ అలా అని ఉంటాడని ఆయన అన్నాడు. 

2011 ప్రపంచకప్‌నకు ముందు జరిగిన ఐపీఎల్‌లో యువీ కూడా పెద్దగా రాణించలేదు. కానీ, వరల్డ్‌కప్‌లో అద్భుతంగా రాణించి భారత్‌కు కప్‌ అందించాడు. ఇక ఐపీఎల్‌ 12వ సీజన్‌లో 28.92 సగటుతో 15 ఇన్నింగ్స్‌ల్లో రోహిత్‌ కేవలం 405 పరుగులు మాత్రమే సాధించాడు.

ప్రపంచ కప్ పోటీల్లో రోహిత్ శర్మ పరుగుల వరద పారిస్తున్నాడు. శనివారం శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ శర్మ మరో సెంచరీ చేశాడు. 94 బంతుల్లో 103 పరుగులు చేశాడు. అందులో 14 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి. తాజా ప్రపంచకప్ పోటీల్లో ఐదు సెంచరీలు చేసి ఒక వరల్డ్‌కప్‌లో అత్యధిక సెంచరీలు  చేసిన క్రికెటర్‌గా రికార్డులకెక్కాడు.