లండన్: శ్రీలంకపై శనివారం జరిగిన మ్యాచులో సెంచరీ సాధించడం ద్వారా కుమార్ సంగక్కర రికార్డును బద్దలు కొట్టిన టీమిండియా హిట్ మ్యాన్ రోహిత్ శర్మ మరో అరుదైన ఘనతను కూడా సాధించాడు. భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ రికార్డును సమం చేశాడు. 

ప్రపంచ కప్ పోటీల్లో ఆరు సెంచరీలు చేసిన సచిన్ టెండూల్కర్ రికార్డును రోహిత్ శర్మ సమం చేశాడు. ప్రస్తుతం జరుగుతున్న ప్రపంచ కప్ పోటీల్లో ఐదు సెంచరీలు చేసిన రోహిత్ శర్మ 2015లో జరిగిన టోర్నమెంటులో సెంచరీ చేశాడు. దీంతో సచిన్ టెండూల్కర్ రికార్డును సమం చేశాడు. 

అదే సమయంలో బంగ్లాదేశ్ క్రికెటర్ షకీబ్ అల్ హసన్ ను పరుగుల వేటలో వెనక్కి నెట్టేశాడు. ఈ ప్రపంచ కప్ టోర్నమెంటులో ఇప్పటి వరకు అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా బంగ్లాదేశ్ కు చెందిన షకీబ్ కొనసాగుతూ వచ్చాడు. ప్రస్తుత టోర్నమెంటులో రోహిత్ శర్మ 647 పరుగులు చేసి అగ్రస్థానంలో నిలిచాడు.

ప్రపంచ కప్ ఒక ఎడిషన్ లో 600 పరుగులకు మించి చేసిన నలుగురు ఆటగాళ్లలో రోహిత్ శర్మ ఒకడిగా ఘనత సాధించాడు. సచిన్ టెండూల్కర్ (ఇండియా - 2003) మాథ్యూ హెడెన్ (ఆస్ట్రేలియా - 2007), షకీబ్ అల్ హసన్ (బంగ్లాదేశ్ - 2019) మాత్రమే ఇప్పటి వరకు పరుగుల వేటలో 600కు పైగా చేశారు.