ప్రపంచ కప్ టోర్నీ ఆరంభంలోనే పాకిస్తాన్ జట్టు చతికిల పడింది. ఇంగ్లాండ్ లోని నాటింగ్ హామ్ స్టేడియంలో వెస్టిండిస్ తో తలపడ్డ పాక్ ఘోర పరాభవాన్ని చవిచూసింది. ఇలా మొదటి మ్యాచ్ లోనే పాక్ చెత్త ప్రదర్శనతో ఓటమిపాలవ్వడం ఆ దేశ అభిమానులనే కాదు మాజీలను కూడా చాలా బాధించినట్లుంది. దీంతో వారు బహిరంగంగానే తమ జట్టు ఆటగాళ్లపై ద్వజమెత్తుతున్నారు. తాజాగా పాక్ మాజీ ఫేసర్, రావల్పిండి  ఎక్స్ ప్రెస్ షోయబ్ అక్తర్ అయితే ఏకంగా పాక్ కెప్టెన్ సర్పరాజ్ పై తీవ్ర విమర్శలు చేశాడు. 

ప్రముఖ పాకిస్థాన్ జర్నలిస్ట్ సాజ్ సాదిక్ పాక్ వైఫల్యంపై ఓ ట్వీట్ చేశాడు. అందులో షోయబ్ తనతో పాక్ ఓటమి గురించి మాట్లాడుతూ కెప్టెన్ సర్పరాజ్ అహ్మద్ పై ఎలా మండిపడ్డాడో పేర్కొన్నాడు. ''  ఈ మ్యాచ్ టాస్ కోసం సర్ఫరాజ్ అహ్మద్ మైదానంలోకి వచ్చినప్పుడు అతన్ని గమనించా. అతడి పొట్ట ముందుకు వచ్చి చాలా అసహ్యంగా అనిపించిందని...అతడి ముఖం కొవ్వుపట్టినట్లు తయారయి వుంది. నేను ఇప్పటివరకు చూసిన చాలా మంది కెప్టెన్లలో ఇతడే మొదటి అన్ ఫిట్ కెప్టెన్.  శరీరమంతా కొవ్వు పేరుకుపోయి కనీసం పక్కకు కదల్లేని పరిస్థితిలో అతడున్నాడు. వికెట్ కీపింగ్ సమయంలోనూ అతడు చురుగ్గా కదల్లేక చాలా  ఇబ్బందిపడ్డాడు'' అని షోయబ్ తనతో చెప్పాడని సాదిక్ వెల్లడించాడు. 

పాక్ ఓటమిపై షోయబ్ అక్తర్ కూడా స్వయంగా తన ట్విట్టర్ ద్వారా స్పందించాడు. ''  మ్యాచ్ ముగిసింది. అయ్యిందేదో అయిపోయింది. నా  ఆలోచనలు,  భావోద్వేగాలను మరోసారి గుర్తుచేసుకుంటున్నా. వారు(పాక్ ఆటగాళ్లు) మన దేశానికి ప్రాతినిద్యం వహిస్తున్నారు...  కాబట్టి మనమంతా ఇలాంటి క్లిష్ట సమయంలో వారివెంట అండగా నిలబడాలి. ప్రపంచ కప్ టోర్నీ మొత్తంలో మన మద్దతు వారికెంతో అవసరం.''అని అన్నారు. అంతకు ముందు పాక్ ఓటమిపై స్పందించడానికి నిరాకరిస్తూ '''స్పీచ్ లెస్'' అంటూ  అక్తర్ ట్వీట్ చేశాడు.  

విండీస్ బౌలర్ల దాటికి పాక్ టాప్ ఆర్డర్ తో సహా జట్టు జట్టంతా విలవిల్లాడిపోయింది. కేవలం నలుగురు ఆటగాళ్లను మినహాయిస్తే మిగతావారెవ్వరు కనీసం రెండంకెల స్కోరును కూడా సాధించలేకపోయారు. పాక్ ఇన్నింగ్స్ లో ఫకార్ జమాన్, బాబర్ ఆజమ్ లు సాధించిన 22 పరుగులే హయ్యెస్ట్ స్కోర్. చివర్లో వాహబ్ రియాజ్ 11 బంతుల్లో 18 పరుగులు కాస్త దాటిగా ఆడటంతో కనీసం పాక్ స్కోరు సెంచరీ మార్కును దాటగలిగింది.  ఇలా పాక్ కేవలం 105 పరుగులకే ఆలౌటయ్యింది. అయితే బౌలర్లలో అమీర్ మూడు వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు.అయితే లక్ష్యం చాలా తక్కువగా వుండటంతో విండీస్ కేవలం 13.4  ఓవర్లలోనే విజయాన్ని అందుకుంది.