బర్మింగ్‌హామ్‌: అంబటి రాయుడి రిటైర్మెంట్ పై టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ స్పందించాడు. ట్విట్టర్ వేదికగా ఆయన తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు.ట  రాబోయే కాలంలో అంతా మంచే జరగాలని కోరుకుంటున్నానని అంటూ రాయుడు! నువ్వు ఉన్నతమైన వ్యక్తివి అని అన్నాడు. క్రికెట్ అన్ని ఫార్మాట్ల నుంచి రాయుడు తప్పుకున్న విషయం తెలిసిందే.

ప్రపంచ కప్ జట్టులో తనకు స్థానం దక్కుతుందని ఆశించిన అంబటి రాయుడికి నిరాశే ఎదురైంది. అతని స్థానంలో ఆల్ రౌండర్ విజయ శంకర్ ను బిసిసిఐ సెలెక్టర్లు ఎంపిక చేశారు. అందుకు గల కారణాన్ని చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ వెల్లడించారు. ఆ తర్వాత రాయుడిని స్టాండ్ బై ఆటగాడిగా ప్రకటించారు. 

తొలుత శిఖర్‌ ధావన్‌ గాయం నుంచి తప్పుకోగా అతడికి బదులు రిషభ్‌పంత్‌ను ఎంపిక చేశారు. రిషబ్ పంత్ ను కూడా సెలెక్టర్లు స్టాండ్ బై ఆటగాడిగా ప్రకటించారు. ఆ తర్వాత విజయ్‌శంకర్‌ కూడా గాయపడడంతో అంబటి రాయుడిని పక్కన పెట్టి మయాంక్‌ అగర్వాల్‌ని ఎంపిక చేశారు. 

దాంతో రాయుడు తీవ్ర మనస్తాపానికి గురై రిటైర్మెంట్‌ ప్రకటించాడని భావిస్తున్నారు. టీమ్ మేనేజ్ మెంట్ అంబటి రాయుడిని కాకుండా మయాంక్ అగర్వాల్ ను కోరుకుందని, ముఖ్యంగా విరాట్ కోహ్లీ, రవి శాస్త్రి మయాంక్ అగర్వాల్ కోసం పట్టుబట్టారని తెలుస్తోంది. దాంతో రాయుడిని పక్కన పెట్టినట్లు విమర్శలు వస్తున్నాయి.