మాంచెస్టర్‌: టీమిండియా కెప్టెన్ విరాట్‌ కోహ్లి అంతర్జాతీయ క్రికెట్‌లో మరో మైలురాయిని చేరుకున్నాడు. ప్రపంచకప్‌లో భాగంగా పాకిస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో 57 పరుగులు చేయడంతో వన్డేల్లో 11 వేల పరుగులు పూర్తి చేసిన తొమ్మిదో ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. 

దానికితోడు, అత్యంత వేగంగా ఆ ఘనత అందుకున్న ఆటగాడిగా కోహ్లీ మరో రికార్డును సొంతం చేసుకున్నాడు. గతంలో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ 276 ఇన్నింగ్స్‌లో 11వేల పరుగులు చేయగా,కోహ్లి కేవలం 222 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ ఘనతను సాధించాడు. 

క్రికెట్‌లోకి వచ్చిన 11 ఏళ్ల లోపే ఆ రికార్డును సొంతం చేసుకున్న ఆటగాడిగా కూడా కోహ్లి రికార్డుల్లోకి ఎక్కాడు.  భారత్ తరఫున ఇప్పటివరకు గంగూలీ, సచిన్ మాత్రమే ఈ ఫీట్‌ సాధించారు.