బంగ్లాదేశ్‌పై విజయం సాధించి భారత్ సెమీస్‌లో బెర్త్ ఖరారు చేసుకుంది. భారత్ సెమీస్ చేరాలంటే ఖచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో అభిమానుల కళ్లన్నీ ఆటగాళ్లపైనే ఉంటాయి. మ్యాచ్‌కు ఎవరైనా సెలబ్రిటీలు వస్తే మాత్రం అటువైపు కెమెరాలు ఫోకస్ చేస్తాయి.

అయితే మంగళవారం జరిగిన మ్యాచ్‌లో కెమెరాలన్నీ ఓ వ్యక్తిని టార్గెట్ చేశాయి. ఆమె సెలబ్రిటీ కాదు.. అయినా తన చేష్టలతో అందరి దృష్టిని ఆకర్షించారు. ముఖ్యంగా భారత్ బ్యాటింగ్ చేస్తుంటే ఆమె బూర ఊదుతూ.. కేరింతలు కొడుతూ సందడి చేశారు.  

87 ఏళ్ల బామ్మ తన కుటుంబంతో కలిసి మ్యాచ్‌కు హాజరయ్యారు. తనకు భారత జట్టంటే చాలా ఇష్టమని.. ఆటగాళ్లు తన పిల్లల్లాంటి వారన్న ఆమె టీమిండియా ఖచ్చితంగా ప్రపంచకప్ గెలుస్తుందని చెప్పింది.

తాను చాలా సంవత్సరాలుగా క్రికెట్ చూస్తున్నానని... 1983లో కపిల్‌సేన  ప్రపంచకప్ గెలిచినప్పుడు తాను గ్రౌండ్‌లోనే ఉన్నానని తెలిపారు. భారత్ ప్రపంచకప్ గెలవాలని తాను వినాయకుడికి పూజ చేస్తానని పేర్కొన్నారు.

మ్యాచ్ అనంతరం కోహ్లీ, రోహిత్ శర్మ ఆమెను కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. వారిద్దరికి బామ్మ ముద్దులు పెట్టారు. ఈ బామ్మకు మ్యాచ్ టికెట్లు, ఇతర ఖర్చులు స్పాన్సర్ చేస్తానని ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా ప్రకటించారు.