బర్మింగ్ హామ్: ప్రపంచ కప్ పోటీల్లో భాగంగా బంగ్లాదేశ్ తో మంగళవారం జరిగే మ్యాచులో తుది జట్టులోకి రవీంద్ర జడేజాను తీసుకునే అవకాశం ఉంది. కేదార్ జాదవ్ ను పక్కన పెట్టి జడేజాను తీసుకునే ఆలోచన చేస్తున్నట్లు టీమిండియా బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ చెప్పారు. ముగ్గురు పేసర్లతో ఆడే అవకాశం కూడా ఉందని చెప్పాడు. దీంతో భువనేశ్వర్ కుమార్ కూడా తుది జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. 

జడేజాను తీసుకునే అవకాశం ఉందని సంజయ్ బంగర్ చెప్పిన మాటలపై టీమిండియా మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ తీవ్రంగా ప్రతిస్పందించారు. జడేజా వంటి బిట్స్ అండ్ పీసెస్ వంటి ఆటగాడికి తాను ఫ్యాన్ కానని అన్నారు. జడేజా టెస్టు క్రికెటర్ కు పనికి వస్తాడేమో గానీ 50 ఓవర్ల పరిమిత మ్యాచ్ కు పనికి రాడని అన్నాడు. అంతేకాడు, పరిమిత ఓవర్ల మ్యాచులో తాను జడేజాను స్పిన్నర్ గా గానీ బ్యాట్స్ మన్ గా గానీ పరిగణించబోనని వ్యాఖ్యానించారు. 

ధోనీపై వచ్చిన విమర్శలకు కూడా ఆయన స్పందించారు. ప్రతి ఆటలోనూ ఒకరిపై ఆధారపడడం మంచిది కాదని అన్నారు. ధోనీ వైపే కాకుండా ఇతరుల వైపు కూడా చూడాలని అన్నాడు. భారీ స్కోరు చేయకుండా కెఎల్ రాహుల్ ఎందుకు కొద్ది స్కోరుకే అవుటవుతున్నాడని ప్రశ్నించాలని అన్నారు. 

గాయం కారణంగా సిరీస్ కు దూరమైన విజయ్ శంకర్ పట్ల తనకు గౌరవం ఉందని, అయితే మాయాంక్ అగర్వాల్ జట్టులోకి రావడం తనకు ఆనందంగా ఉందని చెప్పారు. మాయాంక్ అగర్వాల్ ను ఆయన క్లాస్ ప్లేయర్ గా అభివర్ణించారు.