బర్మింగ్‌హామ్‌: ప్రపంచ కప్ పోటీల్లో భాగంగా టీమిండియా ఓపెనర్‌ రోహిత్‌ శర్మ క్యాచ్‌ చేజార్చడమే తమ కొంప ముంచిందని బంగ్లాదేశ్ కెప్టెన్ మష్రఫే మొర్తజా అన్నాడు. దానికి తోడు తాము భారీ భాగస్వామ్యాలు నమోదు చేయలేకపోయామని, ఇది కూడా ఓటమికి కారణమేనని అన్నాడు. రోహిత్ శర్మ 9 పరుగుల వద్ద అవుటై ఉండేవాడు. కానీ క్యాచ్ చేజారడంతో అతనికి లైఫ్ లభించింది. దాంతో తర్వాత పుంజుకుని అతను సెంచరీ పూర్తి చేశాడు.

ఇండియాపై విజయం కోసం తాము శాయశక్తుల ప్రయత్నించామని, కానీ పరిస్థితులు అనుకూలించలేదని మొర్తజా అన్నాడు. తమ ప్రయత్నం బేషుగ్గానే ఉందని, ఒక్క మంచి భాగస్వామ్యం నమోదైనా పరిస్థితి మరో విధంగా ఉండేదని అన్నాడు. అదృష్టం కలిసిరాలేదని, పరిస్థితులు అనుకూలించలేదని మ్యాచ్ అనంతరం ఆయన అన్నాడు. 

షకీబ్‌ అల్‌ హసన్‌, ముష్ఫిక్‌ రహీమ్‌ అద్భుతంగా ఆడారని, రోహిత్‌ క్యాచ్‌ చేజార్చడం నిరాశ కలిగించిందని అన్నాడు. అయితే ఆటలో ఇవి సాధారణమేనని, తమ తదుపరి మ్యాచ్‌లో సర్వశక్తులూ ఒడ్డుతామని చెప్పాడు. అభిమానుల మద్దుతు అద్భుతంగా ఉందని గెలుపుతో టోర్నీని ముగిస్తామని అన్నాడు.