బర్మింగ్‌హామ్‌: ప్రపంచ కప్ పోటీల్లో భాగంగా ఆదివారం జరిగిన మ్యాచులో ఇండియాపై తాము విజయం సాధించడానికి గల కారణాలను ఇంగ్లాండు కెప్టెన్ ఇయోన్ మోర్గాన్ చెప్పాడు. భారత స్పిన్నర్లు చాహల్‌, కుల్దీప్‌లను ధాటిగా ఎదుర్కోవడమే తమ విజయానికి కారణమని ఆయన అన్నాడు. 

ఆదివారం భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లాండు జట్టు 31 పరుగుల తేడాతో విజయం సాధించి సెమీస్‌ ఆశలు సజీవంగా నిలుపుకున్న విషయం తెలిసిందే. తొలి పవర్‌ప్లేలో 47 పరుగులు మాత్రమే చేసిన ఇంగ్లాండ్ ఓపెనర్స్‌‌.. తర్వాతి 10 ఓవర్లలో ఏకంగా 97 పరుగులు రాబట్టుకున్నారు. ఇదే మ్యాచ్‌ తమవైపు తిరిగేలా చేసిందని మ్యాచ్‌ అనంతరం మోర్గాన్‌ అభిప్రాయపడ్డాడు. 

ఈ రోజు మేం అద్భుతం సృష్టించామని, టాస్‌ గెలవడం.. బ్యాటింగ్‌ ఎంచుకోవడం వంటివన్నీ కలిసి వచ్చాయని మోర్గాన్ అన్నాడు. జాసన్‌ పునరాగమనం, బెయిర్‌స్టో విధ్వంసం అద్భుతమని అన్నాడు. వారి భాగస్వామం వల్ల భారీ లక్ష్యాన్ని నిర్దేశించగలిగామని అన్నాడు. భారత  స్పిన్నర్లపై జాసన్‌, బెయిర్‌స్టో విరుచుకుపడటం మ్యాచ్‌ స్వరూపాన్నే మార్చేసిందని అన్నాడు. 

10 నుంచి 20 ఓవర్ల మధ్యే మ్యాచ్‌ తమవైపు తిరిగిందని, ఈ ఓవర్లలో దాదాపు 90 పరుగులు చేసామనుకుంటానని, ఈ తరహా ఆటనే తాము ఆశిస్తున్నామని అన్నాడు. పిచ్‌ సీమ్‌కు అనుకూలిస్తుండటంతో బంతి ఏమాత్రం బ్యాట్‌పైకి రాలేదని, అందుకే చిన్నగా కట్టర్స్‌, స్లో బంతులను ఆడామని చెప్పాడు. 

ఇది ఇంగ్లాండు ఖచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌ అని, దీంతో ఆటగాళ్లు శాయశక్తుల కష్టపడ్డారని, ఈ గెలుపు తమలో ఎంతో ఉత్సాహన్ని నింపిందని చెప్పాడు.  ప్లంకేట్‌ కూడా మంచి ప్రదర్శన కనబర్చాడని, ​ఇదే స్పూర్తితో మిగతా మ్యాచ్‌లను కూడా గెలుస్తామని మోర్గాన్‌ అన్నాడు.