మాంచెస్టర్‌: ప్రపంచ కప్ పోటీల్లో భాగంగా ఆదివారం జరిగిన మ్యాచులో ఇండియాపై తమ ఓటమి పట్ల పాకిస్తాన్ క్రికెట్ జట్టు కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. మిడిల్ ఆర్డర్ కుప్పకూలడం పట్ల ఆయన అసంతృప్తి వ్యక్తం చేశాడు.

టాస్‌ గెలిచి కూడా ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాని పాక్‌ కెప్టెన్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌ అభిప్రాయపడ్డాడు. ఈ మ్యాచ్‌ క్రెడిట్‌ అంతా భారత బ్యాట్స్‌మెన్‌దేనని అన్నాడు. తాము సరిగ్గా బౌలింగ్‌ చేయలేకపోయామని, రోహిత్‌ అద్భుతంగా ఆడాడని అన్నాడు. 

రోహిత్‌కు బాల్‌ అప్‌ ప్రణాళిక రచించామని కానీ అది అంతగా పనిచేయలేదని అన్నాడు. భారత్‌ బ్యాటింగ్‌, బౌలింగ్‌తో సమిష్టిగా రాణించిందని అన్నాడు. మూడు ఓవర్ల వ్యవధిలోనే 4 వికెట్లు కోల్పోయామని, ఇదే మా కొంప ముంచిందని అన్నాడు.  బాబర్ ను కుల్దీప్ యాదవ్ అవుట్ చేసిన తర్వాత 12 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయామని అన్నాడు.

ఫకార్‌, ఇమామ్‌ అద్భుతంగా ఆడారని, కానీ దాన్ని కొనసాగించలేకపోయామని అన్నాడు. ప్రస్తుత పరిస్థితులు తమకు కఠినమేనని, తాము మిగిలిన అన్ని మ్యాచ్‌లు గెలవాలని అన్నాడు.  భారత్ ఓటమితో పాకిస్తాన్ పాయింట్ల పట్టికలో 9వ స్థానానికి పడిపోయింది.