భారత జట్టు మేనేజ్‌మెంట్ తీరుపై విలేకర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తూ మీడియా సమావేశాన్ని బాయ్‌కాట్ చేశారు. ప్రపంచకప్‌లో భాగంగా భారత్ తన తొలి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాతో తలపడనుంది.

ఈ క్రమంలో సోమవారం మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయగా.. దీనికి నెట్ ప్రాక్టీస్ కోసం ఇంగ్లాండ్ వెళ్లిన బౌలర్లు దీపక్ చాహర్, అవేశ్ ఖాన్, ఖలీల్ అహ్మద్‌లు వచ్చారు.

అయితే అంతర్జాతీయ మీడియా ప్రతినిధులు.. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ లేదంటే హెడ్ కోచ్ రవిశాస్త్రినో లేదంటే మరో సీనియర్ క్రికెటర్ వస్తారని ఆశించారు. వీళ్లెవ్వరూ కాకుండా అసలు జట్టులో చోటేలేని ఆటగాళ్లు మీడియా హాల్‌లో కనిపించడంతో విలేకరులు అసంతృప్తి వ్యక్తం చేస్తూ సమావేశాన్ని బాయ్‌కాట్ చేశారు.

దీనిపై టీమిండియా మీడియా మేనేజర్‌ను విలేకరులు సంప్రదించగా.. భారత జట్టు ప్రపంచకప్‌లో ఆటను ఇంకా మొదలుపెట్టకపోవడం వల్లే నెట్ బౌలర్లను పంపించాల్సి వచ్చిందని ఆయన బదులిచ్చాడు.

గత ప్రపంచకప్‌లోనూ భారత జట్టుతో మీడియాకు ఇలాంటి పరిస్ధితులే ఎదురయ్యాయి. నాటి టీమిండియా కెప్టెన్ ధోని మీడియాతో అంటి ముట్టనట్లుగా వ్యవహరించాడు. కాగా భారత పేసర్ జస్‌ప్రీత్ బుమ్రాకు సోమవారం ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ డోప్ టెస్ట్ నిర్వహించింది.