న్యూఢిల్లీ: ప్రపంచ కప్ టీమిండియా జట్టులో స్థానం దక్కించుకోలేని అంబటి రాయుడికి ఐస్ లాండ్ బంపర్ ఆఫర్ ఇచ్చింది. తమ దేశానికి రావాలని, తమ దేశం తరఫున క్రికెట్ ఆడాలని ఐస్ ల్యాండ్ ఆయనను ఆహ్వానించింది.

ప్రపంచ కప్ పోటీలకు టీమిండియా బ్యాకప్‌ ప్లేయర్‌గా అంబటి రాయుడును సెలక్టర్లు ఎంపిక చేశా రు. దానివల్ల విజయ్‌ శంకర్‌ గాయం కారణంగా వెనుదిరగడంతో రాయుడికి అవకాశం వస్తుందని అంతా భావించారు. కానీ, అనూహ్యంగా మయాంక్‌ అగర్వాల్‌కు పిలుపు అందింది. 

మయాంక్ అగర్వాల్ కు స్థానం కల్పించడంతో రాయుడికి మరోసారి నిరాశే ఎదురైంది. దీంతో అంబటి రాయుడి క్రికెట్‌ కెరీర్ ముగిసినట్లేనని అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఐస్‌లాండ్‌ క్రికె ట్‌ విభిన్నంగా స్పందించింది. రాయుడు 3డీ ట్వీట్‌ను ఉద్దేశిస్తూ ఐస్ లాండ్ ట్వీట్ చేసింది. 

తమ పౌరసత్వం ఇస్తామని, తమ దేశం తరఫున క్రికెట్‌ ఆడాలని ఐస్ లాండ్ ట్వీట్‌ చేసింది. ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌లో అగర్వాల్‌ 72.33 సగటుతో 3వికెట్లు తీశాడని,  రాయుడు 3డీ కళ్లజోడును పక్కనపెట్టాలని చమత్కరించింది. 

తాము పంపిన పత్రాలు చదవడానికి మామూలు కళ్లజోడు పెట్టుకోవాలని, తమతో చేతులు కలపాలని ఐస్‌లాండ్‌ క్రికెట్‌ ట్వీట్‌ చేసింది. అంబటి రాయుడు చేయాల్సిందల్లా పౌరసత్వం కావాలని ఓ దరఖాస్తు ఇస్తే సరిపోతుందని తెలిపింది.