ప్రపంచకప్‌ ఆరంభానికి ముందే టీమిండియాకు షాక్ తగిలింది. కెప్టెన్ విరాట్ కోహ్లీ కుడి చేతి బొటన వేలుకు గాయమైంది. శనివారం నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తుండగా.. కోహ్లీ వేలికి గాయమైంది. దీంతో జట్టు ఫిజియో అతనికి ప్రథమ చికిత్స అందించాడు.

అయితే ఈ గాయం కోహ్లీ బ్యాటింగ్ చేస్తుంగా అయ్యిందా.. లేక ఫీల్డింగ్‌లోనా అన్నది తెలియాల్సి ఉంది. ప్రాక్టీస్‌ సెషన్ ముగింపు సందర్భంగా కోహ్లీ ఐస్ గ్లాస్‌లో వేలు పెట్టుకుని నడవటం కనిపించింది.

కాగా.. తొలి మ్యాచ్‌లో పటిష్టమైన దక్షిణాఫ్రికాను ఢీకొట్టడానికి టీమిండియా సన్నద్ధమవుతున్న వేళ కోహ్లీ గాయం అభిమానులతో పాటు జట్టు మేనేజ్‌మెంట్‌ను సైతం ఆందోళనకు గురిచేస్తోంది.

మరోవైపు విరాట్ గాయం గురించి బీసీసీఐ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అయితే గాయం నుంచి కోలుకోవడానికి కోహ్లీకి తగినంత సమయం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రపంచకప్‌లో భాగంగా భారత్ ఈ నెల 5న దక్షిణాఫ్రికాతో తలపడనుంది.