ప్రపంచకప్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో వెస్టిండీస్ బ్యాట్స్‌మెన్‌ను దురదృష్టం వెంటాడింది. అంపైర్ల తప్పుడు నిర్ణయాలకు బలవ్వడంతో గెలవాల్సిన మ్యాచ్‌ను కరేబియన్లు కోల్పోయారు. ముఖ్యంగా విధ్వంసకర ఆటగాడు క్రిస్‌గేల్ ఔటైన విధానం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

తొలుత మిచెల్ స్టార్క్ వేసిన మూడో ఓవర్ ఐదో బంతి గేల్ ప్యాడ్‌లను తాకడంతో ఆసీస్ ఆటగాళ్లు అప్పీల్ చేశారు. దీంతో అంపైర్ ఎల్బీగా ప్రకటించడంతో గేల్ రివ్యూకి వెళ్లాడు. అది నాటౌట్‌గా తేలింది.

తర్వాతి బంతి కూడా అచ్చం ప్యాడ్లకి తగిలింది. మళ్లీ అంపైర్ వేలు పైకెత్తాడు. గేల్ రివ్యూకి వెళ్లడం వెళ్లడం మరోసార నాటౌట్‌గా తేలడం జరిగిపోయింది. అయితే ఐదో ఓవర్లో మరోసారి గేల్‌కు యార్కర్‌నే వేశాడు స్టార్క్. బంతి ప్యాడ్లకు తాకింది.

అంపైర్ మరోసారి ఔటివ్వడంతో క్రిస్ సమీక్షను కోరాడు. అందులో బంతి లెగ్‌స్టంప్ పక్కన తాకేదని తేలింది. అయితే అంపైర్ కాల్ నిర్ణయంపై అతను వెనుదిరగాల్సి వచ్చింది. కాగా గౌల్ ఔటవ్వకముందు బంతిని స్టార్క్ నోబాల్‌గా వేశాడు.

ఈ విషయం టీవీ రీప్లయ్‌లో తేలింది. దీనిని అంపైర్ గుర్తించకపోవడంతో ఆ బంతి ఇన్నింగ్స్‌ లెక్క లోకి వచ్చి క్రిస్ గేల్ పెవిలియన్ చేరాడు. లేదంటే గేల్ ఔటైన బంతి నోబాల్‌కి ఫ్రీ హిట్‌గా మారేదని అభిమానులు కామెంట్ చేస్తున్నారు.

మరోవైపు అంపైర్లపై వెస్టిండీస్ మాజీ క్రికెటర్ మైఖేల్ హోల్డింగ్ మండిపడ్డాడు. ఆ సమయంలో కామెంట్రీ బాక్స్‌లో ఉన్న హోల్డింగ్ అంపైరింగ్ దారుణంగా ఉందని విమర్శించాడు. ఆసీస్ ఆటగాళ్లు పదే పదే అప్పీలింగ్ చేస్తే అంపైర్లు భయపడుతున్నారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.