లండన్‌: భారత్ పై తాము ఓడిపోవడమే మంచిదైందని ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్ అన్నాడు. ప్రస్తుతం ప్రపంచ సెమీ ఫైనల్ కు చేరిన తొలి జట్టు ఆస్ట్రేలియా. ఇప్పటి దాకా ఎనిమిది మ్యాచ్‌లు ఆడిన ఆసీస్‌ ఏడు మ్యాచుల్లో విజయం సాధించి పాయింట్ల పట్టికలో టాపర్‌గా నిలిచింది. 

శనివారం న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌ తర్వాత ఆసీస్‌ ప్రధాన పేసర్‌ మిచెల్‌ స్టార్క్‌ మాట్లాడాడు. భారత్‌పై ఓటమి తర్వాత ఆటగాళ్లలో కసి పెరిగిందని, అదే తమ వరుస విజయాలకు కారణమని అన్నాడు.

భారత్‌తో మ్యాచ్‌ జరిగిన తర్వాత తాము పుంజుకున్న తీరు నిజంగా ప్రశంసనీయంగా ఉందని అన్నాడు. భారత్‌పై ఓటమి తమకు గుణపాఠం నేర్పిందని చెప్పాడు. ఆ మ్యాచ్‌లో ఓడిపోవడం కచ్చితంగా మలుపు తీసుకుందని అన్నాడు. టీమిండియాపై చేసిన పొరపాట్లను త్వరగానే సరిదిద్దుకున్నట్లు తెలిపాడు. 

ఇక తమ ఎటాకింగ్‌ గేమ్‌ క్రమేపీ పెరుగుతూ వచ్చిందని, అటు బ్యాటింగ్‌లోనూ ఇటు బౌలింగ్‌లోనూ దూకుడు కనబరుస్తున్నామని స్టార్క్ చెప్పాడు. తమ అత్యుత్తమ ప్రదర్శన వెలికి రావడానికి భారత్‌పై పరాజయమే కారణమని అన్నాడు.