టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ భారత అభిమానుల తరపున ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్‌కు క్షమాపణలు చెప్పడంతో అతని క్రీడాస్ఫూర్తిని పలువురు మాజీలు ప్రశంసిస్తున్నారు.

కోహ్లీ అంటే విషం కక్కే ఆసీస్ మీడియా సైతం అతనిని ఆకాశానికెత్తేసింది. తాజాగా కోహ్లీ సతీమణి, బాలీవుడ్ నటి అనుష్క శర్మ.. తన భర్త చేసిన పనికి ఉబ్బితబ్బిబ్బవుతోంది. దూకుడైన ఆటగాడు.. దయగలవాడు.. అందుకే అతనికి పడిపోయానంటూ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది.

దీంతో కోహ్లీ అభిమానులు అనుష్క స్టేటస్‌ను తెగ షేర్ చేస్తున్నారు. మ్యాచ్ సందర్భంగా బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న స్మిత్‌ను ట్యాంపరింగ్ వివాదాన్ని ప్రస్తావిస్తూ ‘‘చీటర్, చీటర్’’ అంటూ గేలి చేశారు.

కొద్దిసేపు దీనిని గమనించిన కోహ్లీ.. హర్డిక్ పాండ్యా వికెట్ పద్ద వెంటనే ప్రేక్షకుల గ్యాలరీ వైపు చూస్తూ..  అలా ప్రవర్తించవద్దంటూ మందలించాడు. అంతేకాకుండా స్మిత్‌ కోసం చప్పట్లు కొట్టి ప్రొత్సహించాలని సైగ చేశాడు.

అభిమానులను కోహ్లీ మందలించడాన్ని చూసిన స్మిత్.. అభినందనపూర్వకంగా విరాట్ కోహ్లీకి షేక్ హ్యాండ్ ఇచ్చాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.