టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ గాయం కారణంగా ప్రపంచ కప్ 2019 నుండి వైదొలిగిన విషయం తెలిసిందే. ఇలా ప్రతిష్టాత్మక టోర్నీలో భారత జట్టుకు సేవలందించే అవకాశాన్ని కోల్పోయానని బాధపడుతున్న అతడికి స్వయంగా భారత ప్రదాని నరేంద్ర మోదీ ఓదార్చే ప్రయత్నం చేశారు. ధావన్ భావోద్వేగానికి లోనవుతూ ట్విట్టర్ లో ఓ వీడియోను పోస్ట్ చేశాడు. దానిపై తాజాగా మోదీ స్పందించారు. 

''ప్రియమైన శిఖర్ ధవన్, నువ్వు పిచ్ ను మిస్సవ్వడం కాదు...పిచ్ నిన్ను మిస్సవుతుంది. ఈ విషయంలో ఎలాంటి సందేహం అవసరం లేదు. అతి తొందరగా నువ్వు కోలుకోవాలని నేను కోరుకుంటున్నా. మునుపటిలా మళ్లీ మైదానంలో అడుగుపెట్టి మన దేశం మరిన్ని విజయాలు అందుకోవడంలో నీవంతు పాత్ర పోషిస్తావని నమ్ముతున్నా.'' అంటూ శిఖర్ ధవన్ ట్వీట్ కు రిప్లై ఇచ్చాడు. 

'' ప్రపంచ కప్ 2019 కు దూరమవుతున్నానని ప్రకటించాలంటే చాలా భాదగా వుంది. కానీ దురదృష్టవశాత్తు నా బొటనవేలి గాయం  ఇంకా తగ్గలేదు. అయితే నేను లేకపోయినా టీమిండియా  విజయపరంపర కొనసాగుతుంది. ఇప్పటివరకు నాకు అండగా నిలిచచి మీ ప్రేమను  అందించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ముఖ్యంగా  క్లిష్ట సమయంలో నాకు మద్దతుగా నిలిచిన సహచర ఆటగాళ్లు, క్రికెట్ ప్రియులు, దేశ ప్రజలకు నా కృతజ్ఞతలు. జై హింద్'' అంటూ ధవన్ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ పైనే తాజాగా మోదీ స్పందించారు. 

ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో ధవన్ సెంచరీతో అదరగొట్టి ఫామ్ లోకి రావడంతో అభిమానులు ఆనందించారు. కానీ ఆ ఆనందం ఎంతో సమయం నిలవలేదు. సెంచరీ చేసే క్రమంలోనే  కమిన్స్‌ బౌలింగ్‌లో వేగంగా వచ్చిన ఓ బంతిని  ఆడబోయిన ధవన్ కు గాయమైంది. బంతి  నేరుగా బొటనవేలికి తాకడంతో తీవ్ర గాయమైంది. ఈ గాయాన్ని పరిశీలించిన డాక్టర్లు రెస్ట్ సూచించడంతో మూడు మ్యాచుల పాటు అతడు భారత జట్టుకు దూరమవనున్నట్లు ప్రకటించారు. తాజాగా గాయం తీవ్రత తగ్గకపోవడంతో టోర్నీ మొత్తానికే  దూరమయ్యాడు. 

 

మరిన్ని వార్తలు

2019 వరల్డ్ కప్ షెడ్యూల్ విడుదల 

ప్రపంచ కప్ కు దూరం... ఉద్వేగానికి లోనైన శిఖర్ ధవన్ (వీడియో)