ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న ప్రపంచ కప్ టోర్నీలో టీమిండియా హాట్ ఫేవరెట్ గా బరిలోకి  దిగిన విషయం తెలిసిందే. అందుకు తగ్గట్లుగానే భారత ఆటగాళ్లు అద్భుతమైన ఆటతీరుతో రాణిస్తూ వరుస విజయాలను అందుకుంటోంది. ఇలా మెగా టోర్నీలో దూసుకుపోతున్న సమయంలో ఆటగాళ్ల గాయాలు టీమిండియాను కలవరానికి గురిచేస్తోంది. మరీ ముఖ్యంగా ఐసిసి టోర్నీల్లో చెలరేగిపోయే శిఖర్ ధవన్ గాయం కారణంగా ప్రపంచ కప్ కు పూర్తిగా దూరమవ్వాల్సి వచ్చింది. దీంతో ఆందోళనకు గురవుతున్న భారత శిబిరంలో ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు మైక్ హస్సీ మాటలు దైర్యాన్ని నింపాయి. 

ప్రపంచ కప్ లో కోహ్లీ సేన ప్రదర్శన, ఆటగాళ్ల గాయాల గురించి హస్సీ స్పందించారు. ప్రస్తుతం టీమిండియా అత్యద్భుతయైన క్రికెట్ ఆడుతోందని ప్రశంసించారు.  అయితే ఒకరిద్దరు ఆటగాళ్లు గాయాలతో జట్టును వీడటం వల్ల ఆ జట్టుకు వచ్చిన నష్టమేమీ లేదన్నారు. ముఖ్యంగా శిఖర్ ధవన్  వంటి సీనియర్ ఆటగాడు జట్టుకు దూరమైనా అతడి స్థానాన్ని భర్తీ చేయగల సామర్థ్యమున్న ప్రతిభావంతమైన ఆటగాళ్లకు భారత్ లో కొదవలేదని హస్సీ పేర్కొన్నారు. 

అయితే ఒక్కసారిగా అతడు జట్టుకు దూరమవడంతో సీనియర్ ఆటగాళ్లపై మరిన్ని  పరుగుల సాధించాల్సిన భారం పడుతుందన్నారు. అలా కోహ్లీ, రోహిత్ లు ఆ భాధ్యతను స్వీకరిస్తారని నమ్మకముందన్నారు. అంతేకాకుండా ధవన్ స్థానంలో  ఓపెనింగ్ కు దిగుతున్న రాహుల్ కుదురుకోడానికి  కాస్త సమయమివ్వాలని సూచించారు. తానేంటో నిరూపించుకోడానికి రాహుల్ కు ఇది మంచి అవకాశమని హస్సీ తెలిపారు. 

మొత్తానికి ప్రస్తుతానికైతే టీమిండియా  ఆటగాళ్లు ఆందోళన  చెందాల్సిన అవసరమేమీ లేదంటూ హస్సీ ధైర్యాన్నిచ్చాడు. వారు ఎలాగయితే ప్రపంచ కప్ ను మొదలుపెట్టారో అలాగే ముగిస్తారన్న నమ్మకం వుందని హస్సీ వెల్లడించారు.  

సంబంధిత వార్తలు

2019 వరల్డ్ కప్ లో భారత్ తలపడే మ్యాచుల షెడ్యూల్